కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. ట్రిపుల్ ఐటీ విద్యార్ధినుల హాస్టల్లోకి ఓ యువకుడు ప్రవేశించి సెక్యూరిటీ సిబ్బందికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. విద్యార్ధినుల హాస్టల్లోకి ప్రవేశించిన యువకుడు రోజంతా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. హాస్టల్లో విద్యార్థిని రూమ్ లోకి వెళ్లిన అబ్బాయి కూడా ట్రిపుల్ ఐటీ విద్యార్థిగా గుర్తించారు. ఇద్దరూ ట్రిపుల్ ఐటీ లో పీయూసీ సెకండియర్ చదువుతున్నట్టు నిర్దారించారు. కేవలం ఇద్దరు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపి చేతులు దులుపుంది యాజమాన్యం. ఘటన జరిగి 4 రోజుల అయిన తర్వాత కేవలం మీడియాలో కథనాలు రావటంతో ట్రిపుల్ ఐటీ యాజమాన్యం స్పందించింది. ఇంత జరిగినా ఘటనలో కీలకమైన సహ విద్యార్థినులు, సెక్యూరిటీ సిబ్బంది, కేర్ టేకర్ల పై చర్యలు తీసుకోలేదు. దీంతో ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఘటనపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశించారు. త్వరలో ఈ కళాశాలను సందర్శిస్తానని చెప్పారు.