బుల్లి తెరలో చిన్న వేషాలతో కెరీర్‌ను ప్రారంభించిన సంతానం ఇప్పుడు కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ నటుడు. హీరోలందరి చిత్రాల్లోనూ హాస్య నటుడి పాత్ర పోషించి… ప్రస్తుతం హీరోగా నటిస్తున్నారు. ఆయన నటించిన ‘వల్లవనుక్కు పుల్లుం ఆయుధం’, ‘దిల్లుక్కు దుడ్డు’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ‘దిల్లుక్కు దుడ్డు’ చిత్రం ఏకంగా హిందీలో కూడా రీమేక్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని రూపొందించిన రామ్‌బాలానే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌బాలా మాట్లాడుతూ ‘దాదాపు 30 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నా. చాలా మంది హీరోలకు కథలు వినిపించా. ఎక్కడా వర్కవుట్ కాలేదు. ఆ సమయంలోనే నా మిత్రుడు సంతానం.. ‘మనం సినిమా చేద్దాం’ అని పిలిచారు.
అప్పుడే ‘దిల్లుక్కు దుడ్డు’ చిత్రాన్ని తెరకెక్కించాం. పది రోజులు కూడా సినిమా అడలేని ఇప్పటి పరిస్థితుల్లో ఆ చిత్రం ఏకంగా 75 రోజులు ప్రదర్శితమై భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తుండటం ఆనందంగా ఉంది’ అన్నారు. అనంతరం సంతానం మాట్లాడుతూ ‘దిల్లుక్కు దుడ్డు’ చిత్రంలో చివరి 20 నిమిషాలు ప్రేక్షకులు విరామం లేకుండా కడుపుబ్బా నవ్వారు. ఆ విధంగానే పూర్తిగా వినోదాన్ని, హాస్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ సీక్వెల్‌ను తెరకెక్కించాం. ఇందులో శ్రద్ధా శివదాస్ హీరోయిన్‌గా నటించారు. కేరళ నేపథ్యంలో కథ నడుస్తుంది. మొట్టై రాజేద్రన్, విజయ్‌టీవీ రామర్, విపిన్, శివశంకర్ మాస్టర్.. ఇలా అందరూ నవ్విస్తారు. హాస్య నటుడిగా మాత్రమే ఉన్నప్పుడు నా అభిమానులంతా హీరోగా నటించమని అడిగారు. అందుకే ఇప్పుడు హీరోగా చేస్తున్నా. ఒకే రకమైన పనిచేయడం నాకూ ఇష్టం లేదు. త్వరలో తప్పకుండా దర్శకుడినవుతా. ఆర్య హీరోగా ఓ సినిమా తీయాలనుంది. నటుడిగా కన్నా నిర్మాతగా ఉండటం చాలా కష్టం. అందుకే ఇంతలా సన్నబడిపోయానని’ పేర్కొన్నారు.