‘నాకిష్టమైన దుస్తులు వేసుకుంటా నచ్చినట్లు ఉంటా మీకేంటి?’ అని ప్రశ్నించారు నటి పత్రలేఖ. ఆమె గత వారం నిర్వహించిన నెట్‌ఫ్లిక్ సినిమా ‘గిల్టి’ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాకెట్ ఉన్న బ్లాక్ క్రాప్ టాప్, జీన్స్ ధరించారు. ఆమె లుక్ కొందరికి నచ్చినా, కొందరు మాత్రం తప్పుపట్టారు. నటి ‘చీప్’గా కనిపిస్తోందని కామెంట్లు చేశారు. ఈ విమర్శల్ని ఉద్దేశిస్తూ పత్రలేఖ సోషల్ మీడియాలో మాట్లాడారు. తనను తప్పుపట్టిన వారిపై విరుచుకుపడ్డారు. ‘ఈ దుస్తుల్ని నేను సినిమా స్క్రీనింగ్‌కు ధరించా. ఫ్యాషన్ గురించి తెలిసిన కొందరు మెచ్చుకున్నారు, వారికి ధన్యవాదాలు. కానీ చాలా మంది ప్రతికూలంగా కామెంట్లు చేశారు. నేను షాక్ అయ్యా.. ప్రజలు ఓ వ్యక్తిని టార్గెట్ చేసి, ఎందుకు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు’.
‘ఇది నా శరీరం. నాకు నచ్చిన దుస్తులు ధరిస్తా, నచ్చినట్లు ఉంటా. నేను చూడటానికి చీప్‌గా ఉండటం, నా ఆకృతి, బరువు తదితర విషయాలు మీకు అనవసరం. నా శరీరం నా కవచం’ అని గట్టిగా సమాధానం చెప్పారు. పత్రలేఖ ప్రియుడిగా ప్రచారంలో ఉన్న నటుడు రాజ్‌కుమార్ రావు ఆమెకు మద్దతు తెలిపారు. ‘అందమైన అమ్మాయి’ అని కామెంట్ చేశారు.