ప్రముఖ గాయని చిన్మయి.. ఈసారి తమిళ సాహిత్య రచయిత వైరముత్తు తన కంటపడితే చెంప చెళ్లుమనిపిస్తానని అన్నారు. పదేళ్ల క్రితం తనను వైరముత్తు వేధించారని ‘మీటూ’ ఉద్యమం సమయంలో చిన్మయి చెప్పారు. ఓ కార్యక్రమం కోసం విదేశానికి వెళితే అక్కడ.. ఓ వ్యక్తితో తన గదికి రమ్మని ఆయన చెప్పి పంపారని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యల్ని వైరముత్తు ఖండించారు. మరోపక్క ఆయన తమతో కూడా అసభ్యంగా ప్రవర్తించారని పలువురు మహిళలు బయటపెట్టారు.
కాగా ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ గురువారం ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న తనతో గుంపులో ఉన్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీన్ని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ చిన్మయికి ట్వీట్ చేశారు. ‘ఈ మాటలు కేవలం చిన్మయి కోసం మాత్రమే.. మహిళలతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తికి ఖుష్బూ మేడం సరిగ్గా బుద్ధి చెప్పారు’ అని పేర్కొన్నారు. దీన్ని చూసిన చిన్మయి ప్రతిస్పందించారు. ‘కచ్చితంగా.. ఈ సారి నాకు వైరముత్తు కనిపిస్తే తప్పకుండా చెంప చెళ్లుమనిపించాలన్న విషయం గుర్తు పెట్టుకుంటా. చూస్తుంటే.. నాకు కేవలం ఈ విధంగా మాత్రమే న్యాయం జరిగేలా ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
వైరముత్తుపై ఆరోపణలు చేసిన తర్వాత ఆయన అభిమానులు చిన్మయిని తీవ్రంగా విమర్శించారు. పదేళ్ల క్రితమే ఎందుకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తున్నారని తప్పుపట్టారు.