బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాను ఎవ్వరికీ క్షమాపణ చెప్పనని అంటున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సి’. క్రిష్ జాగర్లమూడి, కంగన సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించారంటూ మహారాష్ట్రకు చెందిన కర్ణిసేన సంఘాలు కొంతకాలంగా ఆందోళనలు చేపడుతున్నాయి. సినిమా విడుదలను ఆపకపోతే కంగన కెరీర్‌ను నాశనం చేస్తామంటూ కార్యకర్తలు బెదిరింపులకు దిగుతున్నారు.
వీటిపై గతంలో కంగన స్పందిస్తూ..’నేను ఎవ్వరికీ భయపడను. నేనూ రాజ్‌పుత్‌నే. సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ బెదిరింపులకు పాల్పడితే కర్ణిసేన కార్యకర్తలను నాశనం చేస్తాను’ అని హెచ్చరించారు. కంగన వ్యాఖ్యలు కాస్తా దుమారం రేపాయి. కర్ణిసేన సంఘాలను అవమానించిన కంగన వెంటనే క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. దీనిపై తాజాగా కంగన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఎవ్వరికీ క్షమాపణలు చెప్పను. జీవితంలో ఇప్పటివరకు నా తప్పులేకుండా మరొకరికి క్షమాపణలు చెప్పింది లేదు. సినిమాలో రాణి లక్ష్మీబాయి గురించి తప్పుగా చూపించలేదని ముందే మాటిచ్చాం. అన్నట్లుగానే అలాంటివేమీ చూపించడంలేదు. అలాంటప్పుడు కర్ణిసేన మాకు మద్దతుగా నిలవాలి. లక్ష్మీబాయి నా బంధువు కాదు. ఆమె భారతదేశ ముద్దుబిడ్డ.’ అని చెప్పారు. శుక్రవారం ‘మణికర్ణిక’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో విడుదల కాబోతోంది.