యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. తానెప్పుడైనా నటన నుంచి రిటైర్ అవ్వచ్చని అంటున్నారు. ఆయన హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నేను ఎప్పుడైనా నటనకు స్వస్తి పలకొచ్చు. నాకు సినిమాలకు మించి ఆసక్తికరంగా ఏదన్నా చేయాలనిపించినా, చేసిందే చేస్తున్నానిపించి బోర్ కొట్టినా వెంటనే యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేస్తాను’ అన్నారు. మరి పెళ్లెప్పుడు చేసుకుంటారు? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ఇప్పుడే కాదు. మరో ఐదేళ్లు ఆగాలి. నాకు 35 వచ్చాక చేసుకోవాలని అనుకుంటున్నా’ అన్నారు.
‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో ముద్దు సన్నివేశాలు చర్చనీయాంశంగా మారడంపై స్పందిస్తూ.. ‘సెట్‌లో అందరిముందు ముద్దు పెట్టుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు హీరోతో పాటు హీరోయిన్ కూడా సౌకర్యంగా ఫీలవ్వాలి. అయితే ఈ సన్నివేశాలతో మేం ఇబ్బందిపడినా ఫర్వాలేదు. కానీ, తెరపై చూసే ప్రేక్షకులకు మాత్రం మేం ఇబ్బందిపడినట్లు తెలీకూడదు. నా తర్వాతి సినిమాలో ఎలాంటి ముద్దు సన్నివేశాలు లేవులెండి’ అని చమత్కరించారు విజయ్. ‘డియర్ కామ్రేడ్’ మూవీ శుక్రవారం విడుదల కానుంది.