రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో ఇదుగో.. అదుగో అంటూ ఊరిస్తున్నారు. ఇవాళ్ ప్రెస్‌మీట్ పెట్టి రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు తలైవా. ఈరోజు చెన్నైలో రజినీకాంత్ రజనీ మక్కల్ మండ్రమ్ కార్యదర్శులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. రజినీకాంత్ అనేక విషయాల గురించి తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు తాను రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2021లో తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయనుందని చెప్పారు. తమిళనాడు రాజకీయాలకు పెట్టిందిపేరు. వివేకానంద, గాంధీజీల జీవితాల్లో పెను మార్పులు ఇక్కడే చోటుచేసుకున్నాయి. 2021లో 1967 నాటి చరిత్ర పునరావృతం కావాలి అన్నారు.
తన పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తానని రజనీకాంత్ చెప్పారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆసక్తి లేదని, పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ, బాగా చదువుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని తెలిపారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలి, తమిళనాడు బాగుకోసం ప్రజలు ఆలోచించాలి అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని తన పార్టీలో 60 శాతం సీట్లు 50 ఏళ్ల లోపు వయసుగల వారికే కేటాయిస్తామని అన్నారు. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో పాలనలో సుస్థిరత్వం లేదని రజినీకాంత్ పేర్కొన్నారు.