ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతా నంద తన సోదరుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి హాజరయ్యారు. 2006లో శ్వేత. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. అమితాబ్ కుమార్తె అయినప్పటికీ ఆమె అవకాశాలు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే తన కుమార్తె నవ్య నవేలిని సినీ పరిశ్రమకు దూరంగా ఉంచుతున్నానని అంటున్నారు శ్వేత. ఈ సందర్భంగా తన కుమార్తె సినిమాల్లోకి వచ్చే అవకాశాల గురించి వెల్లడించారు.
‘నా సినీ కెరీర్ ఫ్లాప్ అయింది. మోడలింగ్ చేస్తున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డాను. అందుకే నా పిల్లల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకోవడంలేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. సినీ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడి ఇబ్బందులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. సినిమాలు ఆడకపోయినా, అవకాశాలు రాకపోయినా నటీనటుల ముఖంలో బాధ నాకు స్పష్టంగా కనబడుతుంది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టీవ్‌గా ఉంటాను. ఓ నటుడిగా అభిషేక్ ఫెయిల్ అయ్యాడంటూ సోషల్‌మీడియాలో అతనికి వచ్చే కామెంట్లు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఈ విషయంలో నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నాలాగా నా కూతురు కానీ, నా కుటుంబం నుంచి మరో వ్యక్తి కానీ ఈ బాధను అనుభవించకూడదని అనుకుంటున్నాను.’ అని వెల్లడించారు శ్వేత.