‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ అన్నీ భాషా వసూళ్లను ‘బాహుబలి 2’ సినిమా హిందీ వసూళ్లతో పోల్చడం సరికాదని నిర్మాత శోభూ యార్లగడ్డ అన్నారు. ఇటీవల విడుదలైన హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ భారత్‌లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. కాగా బాలీవుడ్‌లో తొలివారం వసూళ్లపరంగా ముందున్న ఐదు సినిమాలను ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ తో పోల్చారు. ‘బాహుబలి 2’ (రూ.247 కోట్లు-కేవలం హిందీ భాషలో), ‘సుల్తాన్’ (రూ.229.16 కోట్లు), ‘టైగర్ జిందాహై’ (రూ.206.04 కోట్లు), ‘సంజు’ (రూ.202.51 కోట్లు), ‘దంగల్’ (రూ.197.54 కోట్లు) రాబట్టాయని, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ రూ. 260.40 కోట్లతో వీటిని బీట్ చేసిందని ట్వీట్ చేశారు.
దీన్ని చూసిన ‘బాహుబలి’ నిర్మాత శోభూ యార్లగడ్డ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ అన్నీ భాషా వసూళ్లను తీసుకుని, ‘బాహుబలి 2’ సినిమా హిందీ కలెక్షన్స్ మాత్రమే తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘జాబితాలో ఉన్న ఐదు సినిమాలు సాధించిన విజయాల్ని పక్కన పెట్టేయకండి. ఇది సరైన పోలికని నాకు అనిపించడం లేదు. ప్రముఖ విశ్లేషకులైన మీరు ఈ కోణంలో విశ్లేషించడం సరికాదు. ‘బాహుబలి 2′ ఒక్క భాష వసూళ్లు, పాన్ ఇండియా సినిమా అన్నీ భాషా వసూళ్లు కలిపి చెప్పారు’ అని శోభూ ట్వీట్ చేశారు. ‘కచ్చితంగా శోభూ.. నేను మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను’ అని ‘బాహుబలి’ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కూడా ట్వీట్ చేశారు. ‘బాహుబలి 2’ సినిమా తొలివారం అన్నీ వెర్షన్స్ కలెక్షన్స్ కలిపితే దాదాపు రూ.420 కోట్లకు చేరుకుంటుందట. భారత్‌లో ఈ రికార్డు సాధించడం ఏ హాలీవుడ్ సినిమా వల్ల కూడా కాదని అంటున్నారు.