ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) స్వర్ణోత్సవాలు ఆరంభమయ్యాయి. గోవాలో బుధవారం మొదలైన ఈ చిత్రోత్సవం ఈ నెల 28 వరకూ అంగరంగ వైభవంగా కొనసాగనుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్, సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమితాబ్, జావడేకర్, రజనీకాంత్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు.
ఈ చిత్రోత్సవంలో రజనీని ‘ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇఫి’ అవార్డుతో సత్కరించారు. తలైవాకు బిగ్‌బి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డును తనతో కలిసి పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అంకితమిస్తున్నట్లు రజనీ చెప్పారు. అమితాబ్‌ను కూడా ఈ వేడుకలో సత్కరించారు.
ఈ సందర్భంగా బిగ్‌బి మాట్లాడుతూ.. ‘నా విజయాలకు కారణమైన అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నా. నా కష్టాల్లో, సుఖాల్లో వారు నా వెంటే ఉన్నారు. వారు నాపై చూపించిన ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. వారి రుణం తీర్చుకోవాలని నాకు లేదు.. ఎందుకంటే మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ నాతోనే ఉండాలి. రజనీకాంత్‌ను నా కుటుంబంలో సభ్యుడిలా భావిస్తాను. మేమిద్దరం ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటుంటాం. కొన్నిసార్లు సలహాలు ఫాలో అవ్వం. ఓ బంధం అంటే ఇలానే ఉంటుంది. రజనీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం’ అని అన్నారు. ఈ సందర్భంగా జావడేకర్ మాట్లాడుతూ.. ‘వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కళాకారులు గోవాకు విచ్చేశారు. ఈ వేడుక సినీ పరిశ్రమకు, సినిమా మార్కెటింగ్‌కు ముఖ్యమైన వేదిక’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ సతీమణి లత, కరణ్ జోహార్ తదితరులు పాల్గొన్నారు.