ప్రముఖ నటి సమంత తన స్నేహితురాలు, గాయని చిన్మయి శ్రీపాదకు మరోసారి మద్దతు తెలిపారు. ‘మీటూ’ ఉద్యమం సమయంలో ప్రముఖ సాహిత్య రచయిత వైరముత్తు వేధింపుల గురించి చిన్మయి బయటపెట్టినప్పుడు ముందు సామ్ స్పందించిన విషయం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో చిన్మయి గురించి మీడియా సమంతను ప్రశ్నించగా.. ‘చిన్మయికి సపోర్ట్ చేసినందుకు గర్వపడుతున్నాను. ‘మీటూ’ ఉద్యమం విదేశాల్లో ప్రారంభమైంది. అక్కడ మహిళలు ఒకరికొకరు అండగా ఉన్నారు. ఇలాంటి నిజాలు బయటపెట్టడానికి ఎంతో ధైర్యం కావాలి. ఇప్పుడు చిన్మయి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి తప్పు చేయని ఓ వ్యక్తి ఇలాంటి సమస్యలు ఎదుర్కోకూడదు. ఆమెకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నా. ఇప్పటికీ తమిళనాడు డబ్బింగ్ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. నేను, నందిని రెడ్డి కలిసి చిన్మయితో ‘ఓ బేబీ’ తమిళంలో డబ్బింగ్ చెప్పించాం’ అని అన్నారు.
డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిపై ‘మీటూ’ ఆరోపణలు చేసిన తర్వాత చిన్మయిని ఆ యూనియన్ నుంచి తొలగించారు. సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోలేదనే కారణం చెప్పారు. తిరిగి సభ్యత్వం ఇవ్వాలంటే కొన్ని షరతులు పెట్టారు. రాధారవికి క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో చిన్మయి కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఆమెను నిషేధించడంపై తాత్కాలిక స్టే విధించింది.