Hyderabad BJP MP Candidate: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు. దీంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీ లత కూడా ఈ రోజు నామినేషన్ వేశారు. కొంపెల్ల మాధవి లత హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఒకటైన ‘విరించి’కి చైర్మన్. ఆమె బలమైన హిందూ భావాలను కలిగి నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ వస్తున్నారు.
దీంతో ఆమె చేస్తున్న ఎన్నో సేవాకార్యక్రమాలను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే నామినేషన్ వేయడంతో ఆమె తన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు అందించారు. మాధవీలత తన చర, స్థిరాస్తుల విలువ రూ.218 కోట్లుగా వెల్లడించారు. తన కుటుంబ చరాస్తుల విలువ రూ. 165.46 కోట్లు , స్థిరాస్తుల విలువ రూ. 55.92 కోట్లుగా వెల్లడించారు. మొత్తం రూ.27.03 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇక విరించి లిమిటెడ్, వినో బయోటెక్‌లలో తన పేరిట రూ.8.92 కోట్ల విలువైన షేర్లు, తన భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట రూ.56.19 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా అన్‌లిస్టెడ్ కంపెనీలైన గజ్వేల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్‌లలో తన పేరిట రూ.16.27 కోట్ల షేర్లు, తన భర్త పేరిట రూ.29.56 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఇక మొత్తం ఇద్దరి పేరిట 5 కిలోల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో 3.9 కిలోలు తన పేరుమీద కాగా, 1.11 కిలోల బంగారు ఆభరణాలు తన భర్త పేరిట ఉన్నట్లు వివరించారు.
అయితే తనకు సొంతంగా ఎలాంటి వ్యవసాయ భూములు, వాహనాలు లేవని పేర్కొనడం గమనార్హం. తనపై ఒక క్రిమినల్ కేసు కూడా ఉన్నట్లు మాధవీలత తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇక తాను పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసినట్లు పేర్కొన్నారు. ఇక మాధవీలత విషయానికి వస్తే.. ఆమె పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ పాతబస్తీలోనే. నిజాం కాలేజీలో బ్యాచలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో ఈమె NCC క్యాడెట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది, సుమారు వందకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
అయితే ఈసారి మాధవీలతను బలమైన వ్యక్తిపై పోటీకి దింపింది బీజేపీ అధిష్టానం. మజ్లీస్ పార్టీ అధినేత, ఎంఐఎం ఎంపీ అసుద్దీన్ ఓవైసీ పై ఆమె ఎన్నికల బరిలో పోటీకి దిగారు. దీంతో మాధవీలత గెలుస్తారా లేదా ? అని చాలామంది రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో 3 లక్షల మెజారిటీతో అసద్ గెలిచారు. 40 ఏళ్లుగా హైదరాబాద్ లోక్ సభ ఎంపీ సీటు.. మజ్లీస్ పార్టీకే దక్కింది. మరి ఈ సారి ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.