Homeపొలిటికల్Human Trafficking: పవన్‌ కళ్యాణ్‌ చెప్పిందే ఇప్పుడు నిజమౌతుందా?

Human Trafficking: పవన్‌ కళ్యాణ్‌ చెప్పిందే ఇప్పుడు నిజమౌతుందా?

Human Trafficking

Human Trafficking: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో మానవ అక్రమ రవాణా గుట్టు రట్టయింది. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను అక్రమంగా తరలిస్తున్నట్టు తెలిసింది. అంతేకాకుండా ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్షన్నర వరకు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఉద్యోగం ఆశ చూపించి మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు వారు తెలిపారు. దాదాపు 5 వేల మంది వివిధ దేశాల్లో యువత వారి చేతిలో ఉన్నట్టు నిర్దారించామని తెలిపారు.

ముందుగా నిరుద్యోగులను ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాంకాక్‌కు తరలించి అక్కడి నుంచి కంబోడియాకు తరలిస్తున్నట్లు తెలిపారు. కంబోడియా సరిహద్దుల్లో చైనా వాళ్లు ఏర్పాటు చేసిన స్థావరాల్లో ఇక్కడి నుంచి తీసుకెళ్లిన నిరుద్యోగులను బంధించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ముఠా నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కూపీ లాగగా ఈ విషయం బయట పడింది. ఈ ముఠా చేతిలో దాదాపు 5 వేల మంది యువత చిక్కుకున్నట్టు నిర్ధారించారు. కేంద్రంగా చైనాకు చెందిన వారు ఈ అక్రమాలు జరిపిస్తున్నట్లు తెలిపారు. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించినట్టు గుర్తించామని విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్ వెల్లడించారు.

ఈ కేసులో విశాఖలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫెడెక్స్, టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారని విశాఖ సీపీ పేర్కొన్నారు. ఇక్కడ నుంచి కంబోడియాకు వీరిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని.. నిరుద్యోగుల వద్ద నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారని ఆయన చెప్పారు. 80 వేల రూపాయలు అందులో కంబోడియా దేశంలో ఏజెంట్‌కి ఇస్తారని చెప్పుకొచ్చారు. డేటా ఎంట్రీ ఉద్యోగాలు అని చెప్పి ఆన్ లైన్ స్కాంలు చేయాలని వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారని సీపీ రవిశంకర్ అయ్యన్నార్‌ వెల్లడించారు. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం అనగానే మోసపోవద్దని ఆయన సూచించారు. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నుంచి యువత అక్రమ రవాణా జరుగుతోందని దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచించారు. వాలంటరీల ద్వారా ఏపీలోని ప్రతి ఇంటిలోని వ్యక్తుల స్థితిగతులు, అవసరాలు.. అమ్మాయిలు ప్రేమ వ్యవహారాలు, ఒంటరి మహిళల వంటి పూర్తి సమాచారం సేకరించడం వల్ల ఈ డేటా అంతా సంఘవిద్రోహాశక్తుల చేతిలో పడితే ప్రమాదకరం అని పవన్‌ కళ్యాణ్‌ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు పోలీసులు వెల్లడించిన వివరాలను బట్టి చూస్తుంటే ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్‌పై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నిజమేనని అర్థమవుతోంది. భారతదేశాన్ని పతనం చేయాలని, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని చైనా కుట్రలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు భారత్ నుంచి అక్రమ రవాణా ద్వారా నిరుద్యోగులను తరలించి వారి ద్వారానే దేశం నుంచి 100 కోట్లకు పైగా సైబర్ నేరాల ద్వారా మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విశాఖ పోలీసులకు అందిన సమాచారం వరకు 150 మంది ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలించబడ్డారు. దేశవ్యాప్తంగా 5 వేల మంది వరకు ఈ ముఠా చేతిలో చిక్కుకున్నట్లు విశాఖ పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారాన్ని కేంద్ర నిఘా వర్గాలకు చేరవేశామని, ముఠా చేతుల్లో చిక్కుకున్న అందరినీ రక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu