తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ లో కోట్ల రూపాయల్లో బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. పోలింగ్కు ముందే వందల కోట్లు బెట్టింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కూకట్ పల్లిలో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని మెజారిటీ ఎంత? కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు మెజారిటీ ఎంత?.. టీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వస్తాయి? ప్రజాఫ్రంట్ గెలుస్తుందా? ఇది ఏపీలో సాగుతున్న బెట్టింగుల జోరు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు జిల్లాలు, పార్టీలు, మెజారిటీలు వారీగా రకరకాలైన పందేలు జోరుగా సాగుతున్నాయి. పోలింగ్ కంటే ముందే మొదలైన ఈ బెట్టింగులు జోరు పెరుగుతూ పోలింగ్ నాటికి పార్టీల మధ్య మారిన హవాకు అనుగుణంగా మారుతూ వచ్చింది.
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దే విజయమంటూ జాతీయ ఛానెళ్లు తమ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించడంతో బెట్టింగ్‌కు కాస్త విరామం లభించింది. ప్రజాప్రంట్ గెలవబోతుందంటూ లగడపాటి సర్వేతో మళ్లీ బెట్టింగుల జోరు ఊపందుకుంది. ఎవరికి వారు తమ అంచనాలతో బెట్టింగులు చేస్తున్నారు. బృందాలుగా ఏర్పడి రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పందేలు కాస్తున్నట్లు సమాచారం. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమలోని అనంతపురం, కర్నూలులోనూ బెట్టింగుల జోరు బాగా కనిపిస్తోంది.
కొంతమంది పోలింగ్ తర్వాత పరిస్థితిని బట్టి ఓడిపోతామని భావిస్తే బెట్‌ను యావరేజ్ చేసుకునేందుకు సేఫ్‌గా మరో పందెం వేస్తున్నారు. గతంలో వేసిన పరందానికి రివర్స్ లో వేస్తున్నారు. ఎటు గెలిచినా సేఫ్‌గా ఉండేలా బెట్టింగులు నడుస్తున్నాయట. గత రెండు రోజులుగా ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య తెలుగువారు మాట్లాడుకునే ఫోన్ కాల్స్ లో ఈ అంశం తప్పనిసరిగా ఉంటుందట. ఎవరు గెలుస్తారనే అంశంపై అందరూ ఉత్కంఠతో ఉన్నారు. ఎక్కువ శాతం ప్రజాఫ్రంట్ గెలుస్తుందనే పందేలు కట్టినట్లు చెబుతున్నారు.