Koratala Siva Income Tax:
డైలాగ్ రైటర్ గా కెరియర్ ని మొదలుపెట్టి మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారిన కొరటాల శివ.. తరపు స్టార్ హీరోలు అందరితోను పనిచేశారు. ఆచార్య సినిమాతో మొదటి డిజాస్టర్ అందుకున్న కొరటాల ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ చిన్న సినిమాలకు దర్శకత్వం వహించిన కొరటాల ప్రతి ఏడాది నాలుగు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడతారట. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల బయటపెట్టారు.
అసలు విషయానికి వస్తే.. ప్రముఖ తెలుగు దర్శకుడు కొరటాల శివ ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన వివిధ సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అందులో భాగంగా, పన్ను చెల్లింపుదారులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొరటాల శివ మాట్లాడుతూ, ఒకసారి ఎయిర్‌పోర్టులో తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. సాధారణంగా ఎక్కడైనా క్యూలో నిలబడటం ఆయనకు అలవాటు. కానీ ఒకసారి ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా వెళ్లిన సమయంలో ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ తనను వెంట తీసుకెళ్లి ఫాస్ట్‌చెక్-ఇన్ చేయించారని చెప్పారు. ఆ సమయంలో, క్యూలో ఉన్న ఒక ప్రయాణికుడు ఆయనపై ఆగ్రహంగా ప్రశ్నించాడట.
దానికి కొరటాల శివ, “నేను ప్రతి సంవత్సరం దాదాపు 4 కోట్ల రూపాయల పన్ను చెల్లిస్తున్నాను. నాకు ఈ ప్రత్యేక సదుపాయం ఉండాలి. దయచేసి ఈ సదుపాయం నాకు ఇవ్వండి,” అని అన్నారు.
అనంతరం ఆయన తన స్నేహితుడితో, ప్రభుత్వం ఈ తరహా ప్రత్యేక సదుపాయాలను అధిక పన్ను చెల్లింపుదారులకు అందిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కొరటాల శివ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.