ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ విషయానికి వస్తే.. పేర్ని నాని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సుప్రసిద్ధులైన వ్యక్తి పేర్ని నాని.. అసలు పేరు పేర్ని వెంకట్రామయ్య. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టణంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మచిలీపట్నం లోని హిందూ కళాశాలలో పేర్ని నాని బికామ్ పూర్తి చేశారు. పేర్ని కుటుంబం తొలి నుంచి రాజకీయాల్లో ఉంది. పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి కార్మిక సంఘాల నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేశారు.
తండ్రి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన నాని కాంగ్రెస్ పార్టీ తరపున 1999 అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్నంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009 లలో వరుసగా మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2013లో జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరారు. ఆర్నెళ్లు సావాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారు అంటారు. ఈ సామెత పేర్ని నానికి బాగా సూట్ అవుతుంది. జగన్ తో కలవకముందు పేర్ని నాని చాలా మర్యాదస్తుడు. అందర్నీ కలుపుకుపోయిన వ్యక్తి. ఎవర్నీ వ్యక్తిగతంగా దూషించని వ్యక్తి. కానీ, జగన్ గాలి సోకిన తర్వాత పేర్ని నానిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓటమి చవిచూసిన తర్వాత జగన్, పేర్ని నానిని దగ్గరకు తీసుకున్నారు. ఆ సమయంలోనే జగన్ కి వీర విధేయుడిగా మారిపోయారు పేర్ని. ఆ తర్వాత 2019లో మచిలీపట్నం నియోజకవర్గంలో విజయం సాధించారు. 2019–22 వరకు జగన్ తొలి విడత మంత్రివర్గంలో రోడ్డు రవాణా, సమాచార & ప్రసార శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. పాపం మంత్రి కాకముందు వరకూ పేర్ని నానికి వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరుంది,
కానీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సంఘటనల కారణంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన వ్యవహరించిన తీరు పట్ల కాపు సామాజిక వర్గం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పేర్ని నాని గ్రాఫ్ విషయానికి వస్తే.. నేటికీ పేర్ని నానికి మంచి ఫాలోయింగ్ ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా పేర్ని నానికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒకే మంత్రిత్వ శాఖను (సమాచార & ప్రసారాల శాఖ) వివిధ సందర్భాల్లో నిర్వహించిన తండ్రి తనయులుగా పేర్ని కుటుంబం రికార్డు నమోదు చేసింది.