ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. పి.రవీంద్రనాథ్ రెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో రవీంద్రనాథ్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం పోచిమరెడ్డిపల్లె గ్రామంలో ఓ రైతు కుటుంబంలో పి. రవీంద్రనాథ్ జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఇంటర్ పూర్తి చేశారు. రవీంద్ర నాథ్ రాజకీయాల్లోకి రాకముందు పలు రకాల వ్యాపారాలు నిర్వహించారు. రవీంద్రనాథ్ కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే.. తన బావ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మేనల్లుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి.
రవీంద్రనాథ్ జెడ్పీటీసీ గా విజయం సాధించి రాజకీయంగా తన బావ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో తర్వాత కాలంలో కడప పట్టణం మేయర్ గా రెండు సార్లు పని చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత, జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకొని 2014, 19 లలో కమలాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. మరి ఇంతకీ, రాజకీయ నాయకుడిగా రవీంద్రనాథ్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో రవీంద్రనాథ్ రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ రవీంద్రనాథ్ రెడ్డి కి ఉందా ?, చూద్దాం రండి.
ముఖ్యమంత్రి జగన్ కు విశ్వాస పాత్రుడిగా రవీంద్రనాథ్ రెడ్డి మెలుగుతూ వస్తున్నారు. అందుకు ముఖ్య కారణం… బంధుత్వమే. పైగా జగన్ రెడ్డిని నేటికీ ఏకవచనంతో పిలిచే నాయకుడిగా రవీంద్రనాథ్ రెడ్డికి పేరు ఉంది. రవీంద్రనాథ్ రెడ్డికి జగన్ రెడ్డి కూడా మానసికంగా, రాజకీయంగా అలాగే ఆర్ధికంగా కూడా తోడుగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా రవీంద్రనాథ్ రెడ్డికి జగన్ రెడ్డి స్వయంగా ఆర్థిక సాయం చేశారు. ఆ రకంగా రవీంద్రనాథ్ రెడ్డి గెలుపుకి జగన్ రెడ్డి ముఖ్య కారకుడు అయ్యాడు. ఐతే, పి. రవీంద్రనాథ్ రెడ్డి పేరుకు కమలాపురం ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టిన దాఖలాలు లేవు.
కేవలం ప్రజల్లో వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానంతోనే రవీంద్రనాథ్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. తప్పించి తనకంటూ ఎటువంటి సొంత బలం లేదు అని ఆ ప్రాంత ప్రజలే రవీంద్రనాథ్ రెడ్డి గురించి చెప్పుకుంటున్నారు. దీనికితోడు రవీంద్రనాథ్ రెడ్డి కూడా తన రాజకీయాలు (దందాలు) చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే, జగన్ రెడ్డి ఆయనను పిలిచి మరీ హెచ్చరించారు. అయినా, రవీంద్రనాథ్ రెడ్డిలో ఎలాంటి మార్పు లేదు.
జగన్ రెడ్డి చిన్నతనంలో రవీంద్రనాథ్ రెడ్డే జగన్ కి కావాల్సినవి అన్నీ సమకూర్చేవారు. ఆ రకంగా తనకు జగన్ తో అనుబంధం ఉంది. తన గ్రాఫ్ ఎలా ఉన్నా.. జగన్ రెడ్డి తనకు సీట్ ఇస్తాడు అని రవీంద్రనాథ్ రెడ్డి నమ్ముతున్నారు. ఐతే, రవీంద్రనాథ్ రెడ్డి గ్రాఫ్ మాత్రం ఏ మాత్రం బాగాలేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.