ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. నాగార్జున రెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో నాగార్జున రెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ప్రముఖ రాజకీయ కుటుంబంలో నాగార్జున రెడ్డి జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం నాగార్జున కర్ణాటకలోని షిమోగా విశ్వవిద్యాలయం అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ లో బీఈ, అనంతరం యూఎస్ఏ వెళ్లి టెక్సాస్ లోని యూనివర్సిటీ ఆఫ్ హౌస్టన్ లో ఎం ఎస్ పూర్తి చేశారు. నాగార్జున రాజకీయాల్లో రాకముందు అమెరికా లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసే వారు. అనంతరం వ్యాపారం మీద ఉన్న ఆసక్తితో ఇండియా తిరిగొచ్చి విద్యా మరియు ఇతరత్రా రంగాల్లో వ్యాపారాలను నెలకొల్పారు.
నాగార్జున రెడ్డి కుటుంబం తొలి నుండి రాజకీయ కుటుంబమే. ఆయన తండ్రి కె.పి. కొండా రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో కీలకమైన నాయకుడు. మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు నియోజకవర్గాల్లో మంచి ఆదరణ పొందిన నేత కూడా. అన్నింటికి మించి మార్కాపురం నియోజకవర్గం నుండి కె.పి. కొండా రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాగార్జున మామ (భార్య తండ్రి) ఉడుముల శ్రీనివాసుల రెడ్డి సైతం పూర్వం కంభం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. పైగా ఉడుముల శ్రీనివాసుల రెడ్డి కూడా గిద్దలూరు, దర్శి మరియు యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో మంచి ఆదరణ పొందిన నాయకుడు.
అలా తండ్రి, మామ ల ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చిన నాగార్జున రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకొని 2019 ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా నాగార్జున రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో నాగార్జున రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో నాగార్జున రెడ్డి పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ నాగార్జున రెడ్డికి ఉందా ?, చూద్దాం రండి. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న బలమైన రాజకీయ నాయకుల్లో నాగార్జున రెడ్డి కూడా ఒకరు. నిజానికి నాగార్జున రెడ్డికి పెద్దగా రాజకీయ అనుభవం లేదు. కానీ నాగార్జున రెడ్డి వెనుక ఎంతో అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు.
ఆ నాయకులంతా నాగార్జున రెడ్డి కోసం పని చేస్తున్నారు. దీనికితోడు నాగార్జున రెడ్డి చాలా ముందు చూపు గల నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఐతే, తనకు రాజకీయంగా లాభం చేకూర్చే వాటి మీదే ఎక్కువ దృష్టి పెట్టడం నాగార్జున రెడ్డి శైలి. కాకపోతే, నాగార్జున రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా.. నియోజకవర్గం మీద పట్టు సాధించలేకపోవడం విశేషం. ఎమ్మెల్యే తరపున నియోజకవర్గ బాధ్యతలను మామ శ్రీనివాసుల రెడ్డి మరియు తమ్ముడు కృష్ణ మోహన్ రెడ్డి లు షాడో ఎమ్మెల్యేలుగా మారి చూస్తున్నారని స్థానిక ప్రజల సమాచారం. మరి ఈ లెక్కన నాగార్జున రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడే ఏం చెప్పలేం.