ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. బాలినేని శ్రీనివాసరెడ్డి. ఏపీలో బలమైన నేతల్లో బాలినేని కూడా ఒకరు. బాలినేని వాసు గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొణిజేడు గ్రామంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే పూర్తి చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబం తొలి నుంచి రాజకీయ కుటుంబమే. ఆయన తండ్రి వెంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జనతా పార్టీ నుంచి ఒంగోలు నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యార్థి దశలోనే కాంగ్రెస్ విద్యార్థి సంఘంలో కీలకంగా వ్యవహరించారు. యూత్ కాంగ్రెస్ లో సైతం సుదీర్ఘ కాలం పనిచేశారు. 1999 లో తొలిసారిగా ఒంగోలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన బాలినేని 2004, 2009, 2012 (ఉప ఎన్నికలు), 2019 లలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
ఐతే, 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జగన్ వెంట నడిచారు. ఆ రోజుల్లో జగన్ రెడ్డి వెంట నడిచిన అతి కొద్ది మంది నేతల్లో బాలినేని ఒకరు. జగన్ కోసం ఏకంగా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. జగన్ స్థాపించిన వైసీపీ ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలోపేతానికి శక్తివంచన లేకుండా తన వంతు కృషి చేశారు. ఐతే, దీనికి ప్రధాన కారణం జగన్ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి బంధువు అవుతారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి తోడల్లుడు ప్రస్తుత టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోదరి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి. అలా వైఎస్ కుటుంబంతో బంధుత్వం బాలినేని రాజకీయ ఎదుగుదలలో కీలకమైన పాత్ర పోషించింది. ఆ బంధుత్వం కారణంగా ఆయన జగన్ కోసం ఎంతో నమ్మకంగా పని చేశారు.
నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రకాశం జిల్లాలో మంచి పట్టు ఉంది. ఆయన 2009 -12 వరకు వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో గనులు, చేనేత, జౌళి మరియు స్పిన్నింగ్, చిన్న తరహా పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2019 – 22 వరకు జగన్ మంత్రివర్గంలో విద్యుత్, అటవీ, పర్యావరణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైకాపా పార్టీ సమన్వయకర్త గా బాలినేని వ్యవహరిస్తున్నారు. ఇంతకీ రాజకీయ నాయకుడిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో బాలినేని పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో బాలినేని పరిస్థితేంటి ?, మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉందా ? తెలుసుకుందాం రండి.
సాధారణంగా బాలినేని శ్రీనివాసరెడ్డి తన రాజకీయ శత్రువులతో సైతం ఏటువంటి అరమరికలు లేకుండా తొందరగా కలిసిపోతారని ఒంగోలు ప్రజలు ఒకప్పుడు చెప్పుకునేవారు. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా 2019 తర్వాత నుంచి ప్రత్యర్థుల మీద రాజకీయ కక్షలు కార్పణ్యాలతో బాలినేని తన ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రజల్లో కూడా గతంలో ఉన్నంత మంచి పేరును పాడు చేసుకున్నారు. ఇక ఆయన గ్రాఫ్ విషయానికి వస్తే.. బాలినేని శ్రీనివాసరెడ్డి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా వైసీపీ వ్యతిరేకులంతా ఇప్పుడు బాలినేనికి వ్యతిరేకులే. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో బాలినేని గెలవడం కష్టమే. కాబట్టి, ఆయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందనే చెప్పొచ్చు.