అడివి శేష్ హీరోగా శైలేశ్ కొలను డైరెక్షన్లో వస్తున్న చిత్రం ‘హిట్ 2’. నాని సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ‘మేజర్’తో విజయాన్ని అందుకున్న అడివి శేష్ నుంచి వచ్చిన సినిమాగా .. నాని చేసిన పబ్లిసిటీ కారణంగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. అలాంటి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
కథ: వైజాగ్ లో ఒక బార్ లో పనిచేసే సంజన అనే యువతి దారుణంగా హత్య చేయబడుతుంది. ఆమె తల .. కాళ్లు .. చేతులు శరీరం నుంచి వేరు చేయబడతాయి. ఆ హత్యకేసు ఎస్పీ కృష్ణదేవ్ (అడివి శేష్) కి అప్పగించబడుతుంది. అప్పటికే అతను ‘ఆర్య’ (మీనాక్షి చౌదరి) ప్రేమలో ఉంటాడు. ఆమెతో సహజీవనం చేస్తుంటాడు. ‘మ్యాక్స్’ అనే ట్రైనింగ్ డాగ్ ఎప్పుడూ అతని కూడా ఉంటూ ఉంటుంది.
బార్ లో చనిపోయిన యువతి ‘తల’ భాగం మాత్రమే ఆమెకి సంబంధించినదనీ, కాళ్లు .. చేతులు ఇతర యువతులకు సంబంధించినవనే రిపోర్టు రావడంతో కృష్ణదేవ్ ఉలిక్కి పడతాడు. తాము పట్టుకోవలసింది సీరియల్ కిల్లర్ ను అనే విషయం ఆయనకి అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? వరుస హత్యల హంతకుడిని పట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాలు పన్నుతాడు? అసలు హంతకుడు ఎవరు? ఎందుకోసం హంతకుడిగా మారాడు? అనేది కథలోని అంశం.
నటీనటులు: అడివి శేష్ కి పైఅధికారి స్థానంలో రావు రమేశ్ కనిపిస్తాడు. అలాగే మరో ఆఫీసర్ గా మధు సూదన్ కనిపిస్తాడు. సీనియర్ జర్నలిస్ట్ గా పోసాని కనిపిస్తాడు. కానీ ఈ పాత్రలేవీ సరిగ్గా డిజైన్ చేయడం జరగలేదు. హీరో పాత్ర మాత్రమే తెరపై యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. అందువలన అడివి శేష్ పాత్ర మినహా మిగతా పాత్రలన్నీ తేలిపోతాయి. హీరోకి అసిస్టెంట్ గా ఉన్న కోమలి ప్రసాద్ పాత్ర కొంతవరకూ బెటర్. అడివి శేష్ బాడీ లాంగ్వేజ్ .. ఆయన ఈ పాత్రను స్టైలీష్ గా నడిపించిన తీరే ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పుకోవాలి. పాటల పరంగా చూసుకుంటే శ్రీలేఖ స్వరపరిచిన ‘ఉరికే ఉరికే’ పాట బాగుంది. విజువల్స్ పరంగా కూడా ఈ పాట ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువల సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
విశ్లేషణ: ‘హిట్ 1’ సినిమాను తెరకెక్కించిన శైలేశ్ కొలను, అదే బ్యానర్లో ‘హిట్ 2’ సినిమాను రూపొందించాడు. ‘హిట్ 1’ కథకి సంబంధించిన కొన్ని ప్రశ్నలను ఆ కథకే వదిలేసి, ‘హిట్ 2’ లో శైలేశ్ కొలను కొత్త కేసును ఎంచుకున్నాడు. కానీ శైలేశ్ కొలను రాసుకున్న కథలోగానీ .. అల్లుకున్న కథనంలోగాని కొత్తదనం ఎక్కడా కనిపించదు. సైకో థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథలు ఈ ఫార్మేట్ లో నుంచి బయటికి రాకూడదు అన్నట్టుగానే ఈ కథ కూడా ఉంది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో ఒకటి రెండు పాత్రలపై అనుమానం కలిగేలా చేసి, అప్పటివరకూ తెరపైనే కనిపిస్తూ .. ఏ మాత్రం అనుమానం కలగని ఓ పాత్రని క్లైమాక్స్ లో రివీల్ చేస్తుంటారు. అదే ఫార్మేట్ ను పక్కాగా ఫాలో అయిన సినిమా ఇది.
ఇక వరుస హత్యలు చేసే సైకోను పట్టుకోవడానికి హీరో రంగంలోకి దిగితే, ఆ సైకో ఊర్కుంటాడా? ఏ క్షణంలో సైకో ఏ వైపు నుంచి హీరోయిన్ పై దాడి చేస్తాడో అని హీరో టెన్షన్ పడుతూ ఉంటాడేగానీ, లంకంత ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆమెను ఎక్కడికైనా దూరంగా పంపించాలని మాత్రం అనుకోడు. ఇక ఈ కథ రామ్ ప్రసాద్ (హర్షవర్ధన్) ఫ్యామిలీ ఎపిసోడ్ తో మొదలవుతుంది. అందరి దృష్టిని ఈ వైపు మళ్లించి, మరో వైపు నుంచి సస్పెన్స్ ను రివీల్ చేస్తే బాగుంటుందని దర్శకుడు భావించాడు. కానీ హర్షవర్ధన్ ఎపిసోడ్ ను ముందుగా చూపించడమే మైనస్ అయింది. అలాగే అభిలాష్ (శ్రీకాంత్ మాగంటి) పాత్ర ఎంట్రీ .. అతనితో శ్రీకాంత్ అయ్యంగార్ కి జరిగిన సంభాషణ విషయంలో క్లారిటీ లోపించింది.
టైటిల్ : ‘హిట్ 2’
నటీనటులు :అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, హర్షవర్ధన్, కోమలి ప్రసాద్, తనికెళ్ల భరణి తదితరులు
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం: శైలేష్ కొలను
సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ-సురేష్ బొబ్బలి
హైలైట్స్: అడివి శేష్ నటన
డ్రాబ్యాక్స్: కథలో కొత్తదనం లేకపోవడం
చివరిగా: పర్వలేదు
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)