HomeTelugu Big Storiesఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని హైకోర్టు ఆదేశం

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని హైకోర్టు ఆదేశం

1 14

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని సూచించింది. ప్రభుత్వం, యూనియన్ల మధ్య ప్రజలు అవస్థలు పడుతున్నారన్న హైకోర్టు.. నిరసనలు తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయి కదా ? పండుగలు, పాఠశాలలు కొనసాగుతున్న తరుణంలో సమ్మె ఎంతవరకు సమంజసమని కార్మిక సంఘాలను కోర్టు ప్రశ్నించింది. సమ్మె కార్మికుల ఆఖరి అస్త్రం అని… సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కారం కావని కార్మిక సంఘాలు వాదించాయి. అయితే సమ్మె చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కదా అని హైకోర్టు అభిప్రాయపడింది. ఎస్మా ప్రయోగిస్తే ఏం చేస్తారని ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయపరమైనవే కావొచ్చు కానీ… సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మరోవైపు కార్మిక సంఘాలు కోరుతున్నట్టు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదించారు. ఆర్టీసీని విలీనం చేస్తే మరికొన్ని కార్పొరేషన్‌లు ప్రభుత్వంలో కలపాలని డిమాండ్లు చేస్తాయని ఆయన కోర్టుకు వివరించారు. అయితే కార్మికుల డిమాండ్ల ప్రస్తావన ఇక్కడ అనవసరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల ఇబ్బందులనే తమ ముందు ప్రస్తావించాలని తెలిపింది.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. అయితే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.10 వేల బస్సులకు గానూ 6 వేల బస్సులు నడుస్తున్నాయని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే పాఠశాలలకు సెలవులు ఎందుకు పొడిగించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరోవైపు ప్రైవేటు డ్రైవర్లు బస్సు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పిటిషనర్ కోర్టుకు వివరించారు. అయితే ఇప్పటికప్పుడు శిక్షణ పొందిన డ్రైవర్లు ఎక్కడ దొరుకుతారని హైకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu