మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గత 27 రోజులుగా అమరావతిలో రైతులు, మహిళలు, చిన్నారులు ఆందోళన చేస్తున్నారు. అయితే చాలా చోట్ల 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు..శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై జరిగిన దాడులు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. అమరావతిలో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కూడా పర్యటించి బాధితులతో మాట్లాడారు. మీడియాలో కథనాలను సుమోటోగా తీసుకున్న ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్-30 అమలు చేయడంపై రాజధాని గ్రామాలకు చెందిన పలువురు మహిళలు, రైతులు, విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపైనా హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్లు ఇచ్చిన దృశ్యాలను న్యాయమూర్తి పరిశీలించారు. దాడి చేసిన పోలీసుల మీద 354 సెక్షన్ కింద కేసులు ఎందుకు నమోదు లేదని ప్రశ్నించారు.. గ్రామాల్లో పోలీసులు మార్చ్‌ఫాస్ట్ చేయడమేంటి? కర్ఫ్యూ వాతావరణం ఎందుకు? అంటూ ప్రశ్నించింది హైకోర్టు.
రాజధాని గ్రామాల్లో బోర్డర్‌లో ఉన్న పరిస్థితులను కల్పిస్తున్నారని పిటిషనర్ల తరపు లాయర్లు వాదనలు వినిపించారు..కనీసం ఇళ్లలోంచి బయటకు కూడా రానివ్వడం లేదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని ఆధారాలతోసహా కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ దృశ్యాల్లో పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. వచ్చే సోమవారానికి వాయిదా కోరగా.. న్యాయమూర్తి నిరాకరించారు. ఈ అంశాన్ని త్వరగా విచారణ జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలతో శుక్రవారంలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు.