ప్రభాస్ రాముడిగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ విడుదలయినప్పటి నుంచి ఆ సినిమాను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ సినిమాలోని హనుమంతుడి డైలాగులతో పాటు పలు అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినిమా ఉందంటూ అలహాబాద్ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై నిన్నటి నుంచి హైకోర్టు విచారణను ప్రారంభించింది. విచారణ సందర్భంగా సినిమా దర్శకనిర్మాతలపై హైకోర్టు జడ్జిలు జస్టిస్ రాజేశ్ సింగ్ చౌహాన్, జస్టిస్ ప్రకాశ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది రామాయణ గాథ కాదని దర్శకనిర్మాతలు పేర్కొనడంపై ధర్మాసనం మండిపడింది. సినిమాలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు ఉన్నట్టు చూపించి… ఇది రామాయణం కాదని అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు బుర్ర, బుద్ధి లేదని అనుకుంటున్నారా? అని మండిపడింది. సినిమాలోని అభ్యంతరకర డైలాగులకు ఓకే చెప్పిన సెన్సార్ బోర్డుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సినిమాలు, డైలాగులతో భవిష్యత్ తరాలకు ఏం నేర్పించాలనుకుంటున్నారని ప్రశ్నించింది.
సినిమాలో సీత, హనుమంతుడి పాత్రలను మరో విధంగా చూపించారని… ఇలాంటి సన్నివేశాలను సెన్సార్ బోర్డు ముందుగానే తొలగించాల్సిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సినిమా గురించి తాము వార్తలను చదువుతూనే ఉన్నామని, థియేటర్ల వద్దకు వెళ్లి సినిమాను ఆపేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపింది. తమ సహనాన్ని పరీక్షించవద్దని చెప్పింది. ఈ సినిమాకు డైలాగులు రాసిన మనోజ్ ముంతాసీర్ శుక్లా పేరును కూడా పిటిషన్ లో జోడించి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ టీజర్