యాడ్స్‌లో నటించడానికి తారలు ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే సెకన్ల వ్యవధి ఉండే ప్రకటనలకు కోట్లలో పారితోషికం అందుతుంటే ఎవరు మాత్రం కాదంటారు. కాస్త పాపులారిటీ వచ్చిందంటే చాలు ప్రకటనల్లో నటించేందుకు చూస్తారు. అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ సాయి పల్లవి ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ ఆఫర్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 2 కోట్లు ఇస్తామన్నారట. అయినా ఆ యాడ్ చేయడానికి సాయి పల్లవి అంగీకరించలేదు. తాను అలాంటి ఉత్పత్తులను వాడనని.. అలాంటిది ఉత్పత్తులు జనాలను వాడమని ఎలా చెప్పను అంటూ సమాధానమిచ్చిందట.
ఇప్పుడు ఇదే జాబితాలోకి మరో తార చేరింది. బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి కూడా ఓ ప్రకటనలో నటించడానికి రూ. 10 కోట్లు ఇస్తామన్నా నో చెప్పిందట. స్లిమ్మింగ్ పిల్స్ కంపెనీ వారు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం యాడ్‌లో నటించాలని శిల్పాశెట్టిని కోరారట. అందుకోసం రూ. 10 కోట్లు ఆఫర్ కూడా చేశారట. కానీ శిల్పాశెట్టి మాత్రం అందుకు అంగీకరించలేదట. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై శిల్పాశెట్టి మాట్లాడుతూ ట్యాబ్లెట్లు, ఫౌడర్లు వాడటం వల్ల, కడుపు మాడ్చుకోవడం వల్ల బరువు తగ్గుతారంటే నేను నమ్మను. అలాంటి ఉత్పత్తులకు నేను ప్రచారకర్తగా ఉండను అంటోంది. ఆహారంలో మార్పులు చేసుకుని క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే తప్పక బరువు తగ్గుతారని సలహా కూడా ఇస్తోంది. వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాతో వివాహం తర్వాత శిల్పా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. దశాబ్దకాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయబోతుంది. షబ్బీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న నికమ్మతో శిల్ప బాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతుంది.