లాక్‌డౌన్ ముగుస్తుందని ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే కరోనా ముప్పు తప్పదని హీరో వెంకటేష్ అన్నారు. కేవలం లాక్‌డౌన్ మాత్రమే ముగుస్తుందని, కరోనా మహమ్మారి కాదని గుర్తుచేశారు. కరోనా కట్టడి కోసం గత 70 రోజులుగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయని ఆయా ప్రభుత్వాలకు నా ధన్యవాదాలు అన్నారు. కరోనా ఆపత్కాలంలో ప్రాణాలకు తెగించి రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసు సిబ్బందికి కేవలం కృతజ్ఞత మాత్రమే సరిపోదని అన్నారు.
అందరూ లాక్‌డౌన్‌లో పాటించిన జాగ్రత్తలు కరోనా మహమ్మారిని పారద్రోలే వరకూ పాటించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించారు. విక్టరీ హీరో వెంకటేష్ ప్రస్తుతం నారప్ప సినిమాలో నటిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తమిళంలో విజయవంతమైన అసురన్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియమణి, ప్రకాష్‌రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.