మెగా హీరో రామ్‌చరణ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో డిఫెన్స్ అధికారులు నిర్వహించిన యుద్ధవీరుల నివాళుల కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చరణ్ వీరులకు నివాళులు అర్పించి పుష్పగుచ్ఛం సమర్పించారు.
అనంతరం రామ్‌చరణ్ మాట్లాడుతూ…. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను జరుపుకోవడం, దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం నా అదృష్టం. మనం ఇక్కడ ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతున్నామంటే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, దేశ సైనికుల త్యాగాలే దానికి కారణం. సైనికుల ధైర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం నడిచే నేల, పీల్చే గాలి, బతుకుతున్న దేశం మీద వీర జవాన్ల చెరగని సంతకం ఉంటుంది. వీరుల త్యాగాలను ఎవరూ మరిచిపోవద్దు. దేశం ప్రశాంతంగా ఉందంటే అది మన సైనికుల వల్లే. ధృవ సినిమాలో ఆర్మీ జవాన్ పాత్ర పోషించడం గర్వంగా ఉంది’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులతో పాటు పలు స్కూలు విద్యార్థులు సైతం పాల్గొన్నారు.