టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు ప్రమాదం కేసులో రాజ్ తరుణ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్ పై రాజ్ తరుణ్ విడుదలయ్యాడు. కారు యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ పై 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. యాక్సిడెంట్ తర్వాత పారిపోతున్న రాజ్ తరుణ్ ను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న కార్తీక్ పై కూడా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హీరో రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వచ్చాయి. రాజ్ తరుణ్ తన వాల్వో కారు (టీఎస్ 09 ఈఎక్స్ 1100)లో హైదరాబాద్ కు వస్తుండగా అల్కాపూర్ దగ్గర అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడా అని అందరూ టెన్షన్ పడుతున్న సమయంలో ట్విట్టర్ లో తనకు జరిగిన ప్రమాదం గురించి పోస్టు పెట్టాడు. యాక్సిడెంట్ విషయం తెలుసుకున్నాక తనకేమైందోనని చాలామంది కాల్స్ చేస్తున్నారనీ, ఇంత మంది ప్రేమను పొందినందుకు తాను అదృష్టవంతుడినని అన్నాడు.
నార్సింగి సర్కిల్ లో గత 3 నెలలుగా చాలా ప్రమాదాలు జరిగాయని రాజ్ తరుణ్ గుర్తు చేశాడు. కారు ప్రమాదం అనంతరం తాను అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నానని తెలిపాడు. నార్సింగి సర్కిల్ లో ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చిందని.. అక్కడే నేను కారుపై నియంత్రణ కోల్పోయాను.. కారు ఒక్కసారిగా వెళ్లి పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. అప్పుడు వచ్చిన శబ్దానికి నా రెండు చెవులు పనిచేయలేదు. చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. నాకు దెబ్బలేమీ తగల్లేదని నిర్ధారించుకున్నాక కారు నుంచి బయటపడ్డానని అన్నాడు. ఆ ఆందోళనలో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. మిగిలిన విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు.
అయితే ఇప్పుడు ఆ యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ కు సంబంధించిన వీడియో మీడియాలో వైరల్ అవుతోంది. రాజ్ తరుణ్ ప్రమాదం జరిగిన వెంటనే కారు దిగి చెప్పులు కూడా లేకుండా పరిగెత్తాడు. కారు ప్రమాద దృశ్యాలను తన మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన కార్తీక్ అనే వ్యక్తి.. హీరో రాజ్ తరుణ్ ను వెంబడించాడు. అయితే, రాజ్ తరుణ్ తాను మద్యం సేవించి ఉన్నానని, వదిలిపెట్టాలంటూ కోరాడు. ఆ తర్వాత ఆ వీడియోలు ఇచ్చేయాలంటూ తనతో బేరాలకు దిగి, ఆపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కార్తీక్ మీడియాను ఆశ్రయించడం సంచలనమైంది. వీడియోలు ఇచ్చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని, తాను నిరాకరించడంతో బెదిరింపులకు దిగారని కార్తీక్ ఆరోపించాడు. వీడియోల విషయంలో కార్తీక్ ను ఫోన్ ద్వారా సంప్రదించినవారిలో ప్రముఖ నటుడు రాజా రవీంద్ర, మరో మహిళ ఉన్నట్టు కార్తీక్ చెప్పుకొచ్చాడు.