క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘హీరో’ మూవీ చిత్రీకరణ ఆగిపోయింది. ఆయన, తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై కాంబినేషన్లో ప్రారంభమైన సినిమా ఇది. మాళవికా మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణ బాధ్యతల్ని తీసుకుంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. దీనిలో విజయ్ బైకర్‌గా సందడి చేయనున్నట్లు తెలిసింది. రూ.15 కోట్ల ఖర్చుతో కొంత భాగం చిత్రీకరణ కూడా జరిగింది.
అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు సమాచారం. స్క్రిప్టు విషయంలో విజయ్, ఆనంద్‌కు భిన్నాభిప్రాయాలు ఏర్పడటంతో చిత్రీకరణను ఆపినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ సలహాలు తీసుకోవడం ఆనంద్‌కు నచ్చలేదని కూడా చెబుతున్నారు. అంతేకాదు మైత్రి మూవీ మేకర్స్ కూడా అవుట్‌పుట్ విషయంలో సంతృప్తికరంగా లేరట. అందుకే ఇప్పటి వరకు రూ.15 కోట్లు ఖర్చు చేసినప్పటికీ రాజీపడకూడదని చిత్రీకరణను ఆపినట్లు తెలుస్తోంది. మరి ఈ వదంతుల్లో ఏమాత్రం నిజం ఉందో తెలియాలంటే.. విజయ్, మైత్రి సంస్థ స్పందించాల్సిందే.