Nayanthara: Beyond the fairytale Review:
ప్రముఖ నటి నయనతార వివాహానికి సంబంధించిన డాక్యుమెంటరీ ‘Nayanthara: Beyond the Fairytale’ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 1 గంట 22 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ, నయనతార సినీ జీవిత యాత్రను, అంగరంగ వైభవంగా జరిగిన ఆమె వివాహాన్ని చూపుతుంది.
బాగానే ప్రారంభమైన ఈ డాక్యుమెంటరీ లో మొదట నయనతార గ్లామరస్ జీవితాన్ని మాత్రమే చూపించారు. ఆమెకు ఎదురైన కష్టాలను ఆవిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ, చెప్పిన తీరు భావోద్వేగాలు లేకుండా అనిపిస్తుంది. ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉండదు.
ఒక్కో సందర్భంలో ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే కొన్ని భాగాలు ఉన్నా, మొత్తం మీద ఈ డాక్యుమెంటరీ అన్నిటినీ పైపైన చూపినట్టే ఉంటుంది. ఉదాహరణకు, ఆమె సినీ జీవితం ముగింపు తీసుకోవడానికి ఒక వ్యక్తి ప్రభావం చూపినట్లు హింట్ ఇచ్చినా, దానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకపోవడం వల్ల అసంపూర్ణంగా అనిపిస్తుంది.
నటీనటుల విజయాల గురించి చెప్పిన సందర్భాలు కొన్ని ఉంటే, అవి ఆకట్టుకునే విధంగా ప్రదర్శించబడలేదు. ఈ డాక్యుమెంటరీలో నాగార్జున, అట్లీ, రాధిక, డైరెక్టర్ నెల్సన్ వంటి పలువురు ప్రముఖులు కనిపిస్తారు. అయితే, తెలుగు ప్రేక్షకులకు నాగార్జున డబ్బింగ్ పూర్తిగా బాగోలేదు అనే అభిప్రాయం కలుగుతుంది.
వివాహ వేడుక చివరి భాగంలో ఆహ్లాదకరమైన విజువల్స్ ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, షారుఖ్ ఖాన్ వంటి ప్రముఖులు, అంగరంగ వైభవంగా సాగిన వివాహం అందంగా కనిపించినప్పటికీ, అందులో అంతర్గత భావోద్వేగం కనిపించదు. ఏదో ఒక డబ్బులున్న సెలబ్రిటీ ఆడంబరంగా జరుపుకున్న పెళ్లి లాంటి భావన కలిగిస్తుంది.
మొత్తానికి ఈ డాక్యుమెంటరీ ఒక గ్లామరస్ షోగానే మిగిలిపోతుంది. నయనతార జీవిత ప్రయాణాన్ని గురించి లోతుగా తెలియజేసి ఉంటే, ఈ డాక్యుమెంటరీ భావోద్వేగ పరంగా మంచి అనుభూతిని ఇచ్చి ఉండేది.