
Vishwak Sen Movies:
యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు “లైలా” (Laila) అనే సినిమాతో రాబోతున్నాడు. ఇందులో లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విశ్వక్ సేన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ సినిమాల గురించి మాట్లాడిన విశ్వక్ సేన్, తాను హర్రర్ జానర్‌లో సినిమాలు చేయనని తేల్చి చెప్పాడు. “నేను హర్రర్ సినిమాలకు అసలు భయపడను. అందరూ భయపడతారని చెప్పే సినిమాలు కూడా ఒక్కడినే వెళ్లి చూసి వచ్చాను. ఊరి చివర్లోని ఓ విల్లాలో ఒక్కడినే ఉన్నా భయం అనిపించదు. స్మశానంలో పడుకున్నా కూడా భయపడను” అని చెప్పాడు.
హర్రర్ సినిమాల్లో సౌండ్ ఎఫెక్ట్స్ వల్లే భయపెట్టే అనుభూతి కలుగుతుందని, అసలు దయ్యాలు ఉన్నాయనే విషయాన్ని నమ్మబోనని విశ్వక్ స్పష్టం చేశాడు. అందుకే భవిష్యత్తులో కూడా ఈ జానర్ ట్రై చేయనని చెప్పాడు.
విశ్వక్ సేన్ డైరెక్టర్ కూడా కావడంతో, “మీరు భయపడకపోయినా, దర్శకుడిగా హర్రర్ సినిమా తీసి ప్రేక్షకులను భయపెట్టొచ్చు కదా?” అని మీడియా ప్రశ్నించగా, దానికి కూడా ఆయన “నాకు హర్రర్ సినిమాల పట్ల ఆసక్తి లేదు, అందుకే తీసే ఉద్దేశ్యం కూడా లేదు” అని సమాధానం ఇచ్చాడు.
విశ్వక్ సేన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులు మాత్రం భవిష్యత్తులో ఆయన హర్రర్ సినిమాల్లో కనిపిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.