
PVR INOX lawsuit:
సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లాక, అసలు సినిమా మొదలయ్యేలోపు గంటన్నర యాడ్స్ చూస్తూ విసుగు చెందిన సందర్భాలు అందరికీ ఉంటాయి. అయితే బెంగళూరులోని అభిషేక్ ఎమ్.ఆర్. అనే వ్యక్తి మాత్రం ఇలా తన సమయం వృథా అవుతుందనే కారణంతో పివీఆర్, ఐనాక్స్ మరియు బుక్‌మైషో సంస్థలపై కేసు వేసి ₹65,000 పరిహారం పొందడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
అభిషేక్ 2023లో “సామ్ బహదూర్” సినిమా టికెట్లు బుక్ చేసుకున్నాడు. సినిమా 4:05 PMకి మొదలవ్వాల్సి ఉండగా, థియేటర్ యాడ్స్, ట్రైలర్లతో 4:30 PMకి స్టార్ట్ అయ్యింది. ఇలా 25 నిమిషాల సమయం వృథా అవ్వడం వల్ల అతనికి ఇతర పనులకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో, తనకు మానసిక ఒత్తిడి వచ్చిందని, ఆర్థికంగా నష్టం కూడా కలిగిందని పేర్కొంటూ అతను వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు.
ఈ కేసును పరిశీలించిన కోర్టు, థియేటర్లు ప్రేక్షకుల సమయాన్ని వృథా చేయడం అన్యాయమని తేల్చింది. కోర్టు తీర్పు ప్రకారం, ఐనాక్స్ రూ.50,000 పరిహారం, మానసిక ఒత్తిడికి మరో రూ.5,000, మరియు కేసు ఖర్చుల కోసం రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. అదనంగా, పివీఆర్ మరియు ఐనాక్స్ కలిసి వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.1 లక్ష ఇవ్వాలని కోర్టు చెప్పింది. అయితే, బుక్‌మైషోపై మాత్రం ఎటువంటి చర్య తీసుకోలేదు.
ఇక థియేటర్ యాజమాన్యాలు తమ వాదనగా, ప్రభుత్వం సూచించిన ప్రజా ప్రయోజన ప్రకటనలు (PSA) ప్రదర్శించడం తప్పనిసరి అని చెప్పాయి. అయితే కోర్టు, ఆ యాడ్స్ 10 నిమిషాల లోపు ముగియాలి, ఇంటర్వెల్ సమయంలో మాత్రమే ఉంచాలి అని స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో థియేటర్లలో అనవసర యాడ్స్ ప్రసారం చేయడంపై కొత్త చర్చ మొదలైంది. భవిష్యత్తులో ప్రేక్షకుల సమయాన్ని గౌరవిస్తూ, పక్కాగా సినిమా షెడ్యూల్ ప్రకారం ప్రదర్శించాలన్న ఒత్తిడి థియేటర్లపై పెరుగుతుందనడం లో ఎలాంటి సందేహం లేదు.