కోదండరాముడు కొలువుతీరిన భద్రాచలంలో హృదయ విదారక ఘటనచోటుచేసుకుంది. కటిక పేదరికం ఓ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. కరోనా వైరస్ ఆ బాధను వెయ్యింతలు చేసింది. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డ కడు పేదరికం కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తనను వీడిన బిడ్డను కరోనా మహమ్మారి కారణంగా అంత్యక్రియలు కూడా గౌరవంగా చేయలేకపోయారు. భద్రాచలంలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన మనసున్న ఎవరి హృదయాన్ని అయినా పిండేస్తుంది. సుందరయ్యనగర్ కాలనీకి చెందిన షేక్ సాథిక్(13) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి ఫరీదాతో పాటు ఓ అన్న కూడా ఉన్నాడు. తనతల్లి కూలిపని చేస్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తోంది
సాథిక్ రెండేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం చేయించే స్థోమత లేని ఆ తల్లి సాథిక్‌ను స్థానిక ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించింది. ఇటీవల సాథిక్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఏమీ చేయలేని ఆ తల్లి దేవుడిపై భారం వేసింది. చివరికి మృత్యువుతో పోరాడుతూ బాలుడుసాథిక్ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచాడు. కాయకష్టం చేసుకుని బతికే ఆ పేద కుటుంబానికి కరోనా మహమ్మారి కారణంగా అంత్యక్రియలు సైతం భారం అయ్యాయి. కరోనా కారణంగా కాటికి సాగనంపేందుకు ఆ నలుగురు సైతం కరువయ్యారు. బంధువులు ఎవరూ రాకపోవడంతో తన తాత రిక్షాలోనే అంతిమయాత్ర నిర్వహించారు. శ్మశానంలో చేయడానికి డబ్బులేక గోదావరి ఒడ్డునే తాత, తల్లి కలిసి అంత్యక్రియలు పూర్తిచేశారు.