కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో నియంత్రణకు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించగా, చావైనా, బతుకైనా సొంతూర్లూనే అనుకుని, కాలిబాటన వందలు, వేల కిలోమీటర్లు వెళ్లేందుకు మొండిగా రోడ్డుపైకి అడుగిడిన వలస కూలీలే ఇప్పుడు కవితా వస్తువులయ్యారు.
తాజాగా, వలస కార్మికుల దయనీయ పరిస్థితిపై టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆర్ద్రతతో కూడిన స్పందన వెలిబుచ్చారు. తన ఆవేదనకు అక్షరరూపం ఇచ్చారు. “బండరాళ్లను పిండి చేసిన చేతులు డొక్క నొప్పికి లొంగిపోయాయి”, “పెద్ద పెద్ద ఇనుప చువ్వలను వంచిన వేళ్లు మెత్తని పేగుల ముందు ఓడిపోయాయి”. “మమ్మల్ని చూసే లోకులకు బాధేస్తోంది, జాలేస్తోంది.. కానీ మాకు మాత్రం ఆకలేస్తోంది” అంటూ వలస కూలీల బాధాతప్త అంతరంగాన్ని హరీశ్ శంకర్ తన ట్విట్టర్ పోస్టులో కళ్లు చెమర్చే రీతిలో ఆవిష్కరించారు.