అన్ని రంగాల్లోనూ అన్ సీజన్ ఉన్నట్లే సినిమారంగానికీ అన్‌సీజన్ ఉంటుంది. అదే పరీక్షల కాలం. ఈ సీజన్‌లో భారీ బడ్జెట్ మూవీలు, పెద్ద హీరోల సినిమాలు విడుదల చేయడానికి మన నిర్మాతలు ఆసక్తి చూపరు. ఇలాంటి సీజన్‌లోనే చిన్న సినిమాలకు అవకాశం ఉంటుంది. థియేటర్ల కొరత ఉండదు. పెద్ద హీరోల సినిమాల తాకిడి ఉండదు. అందువల్లే ఈ సీజన్‌లో లోబడ్జెట్ సినిమాల విడుదలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇటువంటి సీజన్‌లో విడుదలైన ఒకటి రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించినప్పటికీ కలెక్షన్లు రాబట్టడంలో ఆశించి స్థాయిలో లేవు. ఈ వారం విడుదలైన చిన్న సినిమాలు కలెక్షన్లు రాబట్టడంలో చాలా కష్టపడుతున్నాయి. కనీసం థియేటర్ అద్దెలు కూడా రాబట్టడం కష్టమవుతోందని అంటున్నారు. ఇలాంటి అన్‌సీజన్‌లో విడుదలైన హిట్ సినిమాలు సైతం ఆశించిన కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో జనాలు థియేటర్లకు రావడానికి భయపడుతున్నారనేది మరో కారణం.
అందుకే ఈ వారం విడుదలైన పలాస, ఓ పిట్టకథ సినిమాలు సైతం మొదటిరోజు సరైన కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. అందుకే కొత్త సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు సైతం ఆసక్తి చూపించడం లేదు. ఏప్రిల్ నెలాఖరుకు వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నారనడంలో సందేహం లేదు.