HomeTelugu Reviews'హను-మాన్‌' మూవీ రివ్యూ

‘హను-మాన్‌’ మూవీ రివ్యూ

Hanuman review
టాలీవుడ్‌ యువ నటుడు తేజ సజ్జ హీరోగా నటించిన పాన్‌ ఇండియా మూవీ హను-మాన్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా భారతీయ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. మంచి హోప్స్‌ మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సూపర్ హీరో అవ్వాలనే పిచ్చి కోరికతో చిన్నతనంలోనే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు మైకేల్ (వినయ్ రాయ్). అందుకు అడ్డు చెప్పటంతో తల్లిదండ్రులనే అతడు చంపేస్తాడు. సూపర్ హీరో అయ్యే ప్రయత్నాలను చేస్తూనే ఉంటాడు. ఇక, ప్రకృతి అందాల మధ్య ఉండే ‘అంజనాద్రి’ అనే ప్రాంతంలో చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు హనుమంతు (తేజ సజ్జా). తమ్ముడు హనుమంతు బాధ్యతను చూసుకుంటూ ఉంటుంది అంజమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్). బందిపోట్ల నుంచి రక్షణ కల్పిస్తామనే పేరుతో అరాచకాలు చేస్తూ అంజనాద్రిలో అజమాయిషి చేస్తుంటాడు పాలెగాడు గజపతి (రాజ్‍దీపక్ శెట్టి).

హనుమంతు చిన్నప్పటి నుంచి ప్రేమించే మీనాక్షి (అమృత అయ్యర్).. మెడిసిన్ పూర్తి చేసుకొని ఊరికి వచ్చేస్తుంది. అయితే, హనుమంతుని ఆమె పట్టించుకోదు. మరోవైపు పాలెగాళ్ల అరాచకాలను మీనాక్షి ప్రశ్నిస్తుంది. ఈ క్రమంలో మీనాక్షిని చంపేందుకు గజపతి మనుషులు ప్రశ్నిస్తారు. మీనాక్షిని కాపాడే క్రమంలో తీవ్ర గాయాల పాలై నదిలో పడతాడు హనుమంతు. ఆ తర్వాత అతడికి ఓ మణి వల్ల అతీత శక్తులు వస్తాయి. దీని కోసం మైకేల్ కూడా అంజనాద్రిలో దిగుతాడు. హనుమంతుకి అతీత శక్తులు వచ్చాక పరిస్థితులు ఎలా మారాయి? పాలెగాళ్ల పని పట్టాడా? మీనాక్షి అతడిని ప్రేమిస్తుందా? మణిని తీసుకెళ్లకుండా మైకేల్‍ను హనుమంతు ఎలా అడ్డుకున్నాడు? అంజనాద్రిని ఎలా రక్షించుకున్నాడు? అనేదే కథ.

హనుమంతుడి పేరుతో సూపర్ హీరో చిత్రమనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ తాను అనుకున్న కథను తెరపై కూడా పర్‌ఫెక్ట్‌గా చూపించారు. సూపర్ హీరో కావాలని కసిగా ఉండే ఓ పిల్లాడితో ఆసక్తికరంగా హను-మాన్ సినిమా ఓపెన్ అవుతుంది. అంజనాద్రి ప్రాంతాన్ని పరిచయం చేశాక కథనం కాసేపు సాధారణంగా ఉంటుంది. అయితే, ఆ తర్వాత ఆసక్తికరంగా మారుతుంది. మీనాక్షి (అమృత అయ్యర్‌)ను హనుమంతు(తేజ సజ్జా) కాపాడే సీక్వెన్స్ నుంచి కథనం పరుగులు పెడుతుంది. హనుమంతుకు అతీత శక్తులు వచ్చే అండర్ వాటర్ సీక్వెన్స్ అబ్బుపరుస్తుంది. సూపర్ పవర్స్ వచ్చాక హనుమంతు చేసే పనులు కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పిల్లలకు, సూపర్ హీరోల ఫ్యాన్స్‌కు ఇవి బాగా నచ్చేస్తాయి.

గెటప్ శీను పాత్ర కూడా బాగా వినోదాన్ని పంచుతుంది. కోతి (రవితేజ వాయిస్ ఓవర్) పాత్ర కూడా నవ్విస్తుంది. మన తెలుగు హీరోల ఇమిటేషన్ కూడా సర్‌ప్రైజింగ్‍గా ఉంటూ.. అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్‍లో ఎంటర్‌టైన్‍మెంట్ పోర్షన్ కూడా మెరుగ్గా తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ. ఇంటర్వెల్ సీక్వెన్స్ కళ్లప్పగించుకొని చూసేలా చేస్తుంది. ఆ తర్వాతే మైకేల్ రాకతో అసలు అంజనాద్రికి అసలు సమస్య మొదలవుతుంది.

ద్వితీయార్ధంలోనూ ఆరంభంలో కథనం కాస్త నెమ్మదించినట్టు అనిపించేలోపే.. మళ్లీ రసవత్తరంగా మారుతుంది. హనుమంతు వద్ద ఉన్న మణి కోసం అంజనాద్రి ప్రజల వద్ద మంచివాడిగా మైకేల్ (వినయ్ రాయ్) నటించడం.. అతడి నిజస్వరూపారాన్ని హనుమంతు గుర్తించడం లాంటివి ఆసక్తికరంగా ఉంటాయి. ఇక పెద్ద బండరాయిని హనుమంతు మోసే సీక్వెన్స్ గూజ్‍బంప్స్ తెప్పిస్తుంది. విలన్లు కాల్చే బుల్లెట్లతో రాముడి రూపం దానికి కొనసాగింపుగా వచ్చే విజువల్ హనుమంతుడి గురించి సముద్రఖని వివరించే డైలాగ్స్, సెకండ్ హాఫ్‍లో ప్రశాంత్ వర్మ చాలా ఎలివేషన్లు ఇచ్చి ప్రేక్షకులను కట్టిపడేస్తాడు.

మైకేల్ కుతంత్రాలు, హను-మాన్‍కు ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌ హైలైట్‍గా నిలిచాయి. హిమాలయాల నుంచి హనుమంతుడు వచ్చే తీరును చూపించిన విధానం మెప్పిస్తుంది. సముద్రఖని పాత్ర కూడా ఔరా అనిపిస్తుంది. చివర్లో వచ్చే విజువల్స్ మాత్రం చాలా ప్రేక్షకుల మనస్సులో గుర్తుండి పోయేలా ఉన్నాయి. మొత్తంగా ఇది ఓ మంచి ఫీల్‌ గుడ్‌ మూవీ. ఇక ఈ సినిమాకు సీక్వెల్స్‌ ‘జై హనుమాన్’ను కూడా ప్రకటించేశారు.

ఈసినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం పీఎఫ్‍ఎక్స్. ఈ బడ్జెట్‍లో ఈస్థాయి వీఎఫ్‍ఎక్స్ చూపించడం దర్శకుడి పనితనాన్ని చూపిస్తుంది. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఆదిపురుష్ కంటే ఎన్నో రెట్ల తక్కువ బడ్జెట్‍తో హను-మాన్‍లో మంచి ఔట్‍పుట్ సాధించాడు డైరెక్టర్ ప్రశాంత్. ఈ సినిమాలో ఫస్టాఫ్‍, సెకండాఫ్ తొలి అరగంటలో కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. అక్కడ కొన్ని సీన్లు ఎడిట్ చేసి ఉండొచ్చు. ఈ సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పూర్తి స్థాయిలో విజయం సాధించాడు అనే చెప్పాలి. సూపర్ హీరో ఎలిమెంట్లతో పాటు ఎంటర్‌టైన్‍మెంట్‍ను ఆకట్టుకునేలా చూపించారు. దాదాపు సినిమా మొత్తం ప్రేక్షకులు లీనమయ్యేలా చేశారు. ఈ సినిమా తెరకెక్కించడంలో ప్రశాంత్‍కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ కూడా అత్యున్నతంగా సాగింది. ఎలివేషన్ సీన్లలో, క్లైమాక్స్‌లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. చాలా ప్లస్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తేజా సజ్జా హను-మాన్‌ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్‍లోనూ అదరగొట్టారు. హీరోలను ఇమిటేట్ చేసే సీన్ సహా చాలా చోట్ల తేజ వినోదాన్ని కూడా బాగా పండించారు. ఎమోషనల్ సీన్లు కూడా బాగా చేశారు. ముఖ్యంగా సూపర్ హీరోగా తేజ సజ్జా ఆహార్యం, నటన పిల్లలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఆయన అంత సహజంగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్‌కు ఇలాంటి పాత్రలు చేయటం దిట్ట. అంజమ్మ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ అమృత అయ్యర్ అందంతో పాటు నటనలోనూ మెప్పించారు. జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను.. తన వేషం, డైలాగ్ డెలివరీతో హస్యం పంచారు. తేజ- గెటప్ శ్రీను మధ్య సీన్లు ఎంటర్‌టైనింగ్‍గా సాగుతాయి. సముద్రఖనికి మంచి పాత్ర దక్కగా.. ఆయన హుందాగా పూర్తి న్యాయం చేశారు. విలన్ మేకైల్‍గా వినయ్ రాయ్ చాలా సటిల్‍గా.. సీరియస్‍గా చేశారు. వెన్నెల కిశోర్‌ది కాస్త సీరియస్ పాత్రే కాబట్టి.. హస్యం ఎక్కువగా పండించే ఛాన్స్ దక్కలేదు. రాజ్‍దీపక్ శెట్టి సహా మిగిలిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. తన చివరి సినిమాలో రాకేశ్ మాస్టర్ కూడా మెప్పించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu