బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, కన్నడ నటుడు విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే వీరి బంధంపై గుత్తా తాజాగా స్పష్టత ఇచ్చారు. విష్ణు విశాల్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ‘అవును.. మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నాం. ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు. త్వరలోనే మా పెళ్లి జరగబోతోంది. వివాహ తేదీ ఖరారైన తర్వాత, లేదా పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టినప్పుడు మేమే అధికారికంగా ప్రకటిస్తాం’ అని తేల్చి చెపింది.
మార్చి 28న జ్వాల.. విష్ణు విశాల్‌తో సన్నిహితంగా తీసుకున్న ఫొటోల్ని ట్విటర్‌లో షేర్ చేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో అతడ్ని చాలా మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. దీన్ని ఆయన రీట్వీట్ చేస్తూ.. ‘ఫర్వాలేదు.. ఇప్పుడు సామాజిక దూరం ముఖ్యం.. అందరి కోసం ప్రార్థిద్దాం’ అని కామెంట్ చేశారు.
2005లో గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌ను వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. ఓ సందర్భంలో తన విడాకుల గురించి విష్ణు విశాల్ మీడియాతో మాట్లాడారు. ‘నేను గ్రహించిన ఒక విషయం ఏంటంటే.. లోకంలో కచ్చితత్వం లేదు. ఏదైనా ఎప్పుడైనా జరగొచ్చు. నేను పక్కా అని అనుకున్నది నా వివాహం, అది ఇప్పుడు లేదు. ఏమైందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.