బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘గల్లీబాయ్’ సినిమా ఇండియా తరపున 92వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. గల్లీబాయ్ ఉత్తమ ఫారిన్ లాంగ్వేజ్ మూవీ విభాగంలో పోటీపడనుంది. ఈ విషయాన్ని గల్లీబాయ్ సినిమా నిర్మాత ఫర్హాన్ అక్తర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. “గల్లీబాయ్ 92వ ఆస్కార్ అవార్డుల బరిలో పోటీపడేందుకు ఎంపికైంది. మన టైం వచ్చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్‌కు ధన్యవాదాలు. జోయా అక్తర్, రణ్‌వీర్ సింగ్, అలియా భట్ తదితర చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు” అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఆస్కార్ కోసం జ్యూరీ వివిధ భాషలకు చెందిన 28 సినిమాలను ఎంపిక చేసింది. వీటిలో తెలుగు నుంచి డియర్ కామ్రేడ్ కూడా ఉంది. అన్ని చిత్రాలను చూసిన జ్యూరీ సభ్యులు చివరికి గల్లీబాయ్‌ను ఎంపిక చేశారు. ఈ మూవీకి జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. మురికివాడలో జన్మించిన రణ్‌వీర్ సంగీత ప్రపంచంలో తనదైన ముద్రవేయాలని కలలు కని ఎంతో కష్టపడి ర్యాప్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. ఈ కథాంశంతో రూపొందిన సినిమా ఫిబ్రవరి 14న విడుదలై మంచి విజయం అందుకుంది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సుమారు 230 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకుల అంచనా.