HomeTelugu Big Storiesవిజయవాడలో తొలిసారి సీఎం ప్రమాణ స్వీకారం

విజయవాడలో తొలిసారి సీఎం ప్రమాణ స్వీకారం

1 25విజయవాడ నగర చరిత్రలో తొలిసారి ఓ ముఖ్యమంత్రి ఇక్కడ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడామైదానంలో గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. వేదిక, గ్యాలరీల్లో 30వేల మంది కూర్చుని చూసేందుకు వీలుంటుంది. అయితే.. అంతకు రెట్టింపు స్థాయిలో వైసీపీ నాయకులు, జగన్‌ అభిమానులు తరలిరానున్నారని అంచనా. దీనికి తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరాగాంధీ మైదానంలో నుంచి నేరుగా ప్రమాణస్వీకారం చూసేవాళ్లతో పాటు విజయవాడ నగరంలోని పలు కూడళ్లు, కీలకమైన ప్రదేశాల్లో సైతం నిలబడి వేడుకను చూసేలా ఏర్పాట్లు చేశారు. 14 తెరాలను నగరంలోని కీలకమైన కూడళ్లు, ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. ఈ భారీ తెరల ద్వారా లైవ్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఎక్కడికక్కడ సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా వేసవి కావడంతో.. మంచినీళ్లు, మజ్జిగ లాంటివి అందుబాటులో ఉంచుతున్నారు.

జగన్‌ ప్రమాణస్వీకార మహోత్సవం సందర్భంగా విజయవాడ నగరాన్ని వైసీపీ జెండాలతో ముస్తాబు చేశారు. జగన్‌కు చెందిన భారీ కటౌట్లను ఎక్కడికక్కడ కూడళ్లలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేశారు. నగరంలోని మొత్తం దారులన్నీ.. నేడు ఇందిరాగాంధీ క్రీడా మైదానానికే వెళ్లనున్నాయి. ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు బుధవారమే నగరానికి చేరుకుని.. గేట్‌వే హోటల్‌లో ఉన్నారు. జగన్‌, గవర్నర్‌ దంపతులు వేర్వేరుగా విజయవాడ దుర్గమ్మను బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. మంగళగిరి పానకాలస్వామిని సైతం గవర్నర్‌ దంపతులు దర్శించుకున్నారు. వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి నాయకులు సైతం ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలోని హోటళ్లన్నీ నాయకులతో నిండిపోయాయి. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు విజయవాడకు రానున్నారు.

విజయవాడ నగరానికి మూడు వైపులా దూరప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఎక్కడికక్కడ పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని పది ప్రదేశాల్లో పార్కింగ్‌కు ప్రాంతాలను ఏర్పాటు చేశారు. నగరంలో ఉదయం ఏడు గంటల నుంచి హడావుడి ఆరంభం కానుంది. మధ్యాహ్నం 12.23కు జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకు కనీసం నాలుగైదు గంటల ముందునుంచే నాయకులు, పార్టీ శ్రేణుల రాక ఆరంభం కానుంది. ప్రముఖుల రాక సందర్భంగ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు, పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ నగరంలో వాహనాలు, అతిథులు, పార్టీ శ్రేణులతో హడావుడిగా ఉండబోతోంది. నగరంలో సాయంత్రం 4 వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu