జనసేన అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఇవాళ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చిన జనసేన కార్యకర్తలు, పవర్ స్టార్ అభిమానులు ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పవన్‌తో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీ పట్టారు. మరోవైపు పవన్ పాదాలు ఫ్యాన్స్ అభివాదం చేశారు… ఫ్యాన్స్ తాకిడి ఎక్కువ కావడంతో బౌనర్స్ సహాయంతో కారు ఎక్కారు పవన్ కల్యాణ్. తమిళనాడు పర్యటనకు వెళ్లిన పవన్ పలువురు ముఖ్యనేతలతో భేటీకానున్నారు.
ఈ నేపథ్యంలోనే మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, సినీ నటుడు కమల్‌హాసన్‌తో పవన్ సమావేశం కానున్నారు. చెన్నై నుంచి రాజకీయ సమాలోచనలకు జనసేన అధినేత శ్రీకారం చుట్టనున్నారు. దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఇప్పటికే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటలకు తాజ్ కొనమేరాలో పవన్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లోనూ పవన్ క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అక్కడ తన మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు సమాచారం.