పొత్తుల్లో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సమావేశమయ్యారు. టీడీపీ నేతలు ఎల్ రమణ, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మూడు పార్టీలు కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తామని నేతలు ప్రకటించారు. ప్రజల కోసం ప్రతిపక్షాలన్నీ కలుస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇది మొదటి సమావేశం మాత్రమేనని తెలిపారు. అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ, నిరుద్యోగ, మహిళా సంఘాలతో కలిసి వెళ్తామని నేతలు వివరించారు. కేసీఆర్ దుర్మార్గపు పాలన అంతం చేసేందుకు అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని ఎన్నికలకు వెళ్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తామని నేతలు తెలిపారు. దేశంలో ఆదర్శంగా నిలవాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఎవరితోనూ చర్చలు జరపకుండానే అసెంబ్లీని రద్దు చేసిందని విమర్శించారు.
కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా చేతులు కలిపామని విపక్షాలు ప్రకటించాయి. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా మహాకూటమిగా ముందుకెళతామని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ స్పష్టం చేశాయి. కేసీఆర్‌లో నియంతృత్వ పోకడలు పెచ్చుమీరాయని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి పక్షాల గొంతు నొక్కుతోందన్నారు. కాగామహాకూటమి నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని నేతలు పేర్కొన్నారు. మేనిఫెస్టోను ఉమ్మడిగా ప్రజల ముందుంచుతామన్నారు.