బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని, కబీర్, తనికెళ్ళ భరణి, శివరాజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్
సంగీతం: చిరంతన్ భట్
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
తెలుగు జాతికి గర్వకారణమైన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జీవిత చరిత్రను సినిమాగా చేయాలని నిర్ణయించుకున్న క్రిష్ ఆ కథకు బాలకృష్ణను ఎన్నుకొని మొదటి విజయాన్ని అందుకున్నారు. పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాల్లో బాలయ్య చక్కగా ఇమిడిపోతారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ చిత్రం అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
చిన్నప్పుడే తన తల్లి గౌతమితో(హేమామాలిని) రాజ్యాలన్నింటినీ కలిపి ఒకే రాజ్యాంగా అదీ తన రాజ్యంగా చేసుకుంటానని మాటిస్తాడు శాతకర్ణి. ఆ కలను నిజం చేయడానికి తగ్గ ప్రయత్నాలు చేస్తుంటాడు. దక్షిణాదిలో ఉన్న ఒక్కో రాజ్యాన్ని తన రాజ్యంగా కలుపుకుంటూ పోతాడు. అంగీకరించిన వారిని సామంతరాజులుగా ప్రకటించి.. యుద్ధానికి దిగిన వారితో పొరాడి దక్షిణ దిశ వైపు తన జెండాను ఎగరవేస్తాడు. అలానే ఉత్తరదేశాన్ని కూడా జయించి ఉత్తర, దక్షిణాలను ఒకటిగా చేయాలనుకుంటాడు. దానికి ఉత్తరదేశపు రాజు నహపాణుడు అంగీకరించకపోగా.. సామంతరాజుల బిడ్డల్ని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. శాతకర్ణితో యుద్దం ప్రకటించి యుద్ధంలో శాతకర్ణి గెలిస్తే తన ఖడ్గాన్ని సమర్పిస్తానని లేదంటేశాతకర్ణి బిడ్డ పులోమావిని తనకు అప్పగించాలని సవాల్ విసురుతాడు. దానికి శాతకర్ణి అంగీకరిస్తాడు. కానీ శాతకర్ణి భార్య వశిష్టిదేవి మాత్రం తన బిడ్డను యుద్ధానికి పంపించడానికి అంగీకరించదు. దీంతో శాతకర్ణికి తనకు భార్యకు మధ్య దూరం ఏర్పడుతుంది. ఉత్తరదేశంలో కూడా తన జెండా ఎగరవేసిన శాతకర్ణికి యవ్వనుడు అనే గ్రీకు మహారాజుతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఆ యుద్ధంలో తన ప్రాణహాని ఉందని తెలిసినా యుద్ధానికి బయలుదేరతాడు. తన తల్లి గౌతమి బిడ్డను దగ్గరుండి సాగనంపుతుంది. మరి శాతకర్ణి ఆ యుద్ధంలో గెలిచాడా..? వీర మరణం పొందాడా..? శాతకర్ణి పరిపాలించిన శకానికి శాతవాహన శకం అనే పేరు ఎలా వచ్చింది..? అనే విషయాలకు సమాధానమే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
బాలకృష్ణ
ఇంటర్వల్ బ్యాంగ్
యుద్ధ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్
పాటలు
విశ్లేషణ:
తెలుగు జాతి గౌరవాన్ని పెంచి, భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన ‘శాతకర్ణి’ జీవిత చరిత్రను ఎన్నుకొని సినిమాగా చేయాలనే ఆలోచన క్రిష్ కు రావడం అభినందించాల్సిన విషయం. నిజానికి ఈ చరిత్రకు సంబంధించిన ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ తనకు తెలిసి, తను నమ్మిన చరిత్రను కథగా చేసుకొని సినిమా చేయడంలో క్రిష్ ఓ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. సాయి మాధవ్ బుర్రా పనితనం మెచ్చుకోకుండా ఉండలేము. అతడు రాసిన ప్రతి డైలాగ్ ఎంతో ఉన్నతంగా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.
”యుద్ధంలో గెలిచేది సైన్యం కాదు.. వ్యూహం”
”శరణం అంటే రక్ష.. రణం అంటే మరణబిక్ష”
”బడుగుజాతి కాదు తెలుగు జాతి.. అధములం కాదు ప్రధములం”
”యుద్ధం నా బిడ్డ కోసమో.. నీ బిడ్డ కోసమో.. కాదు రేపటి తరాల కోసం”
”దొరికినవాడిని తురుముదాం.. దొరకని వాడిని తరుముదాం.. ఏదిఏమైనా దేశం మీసం తిప్పుదాం”
”ప్రసవ వేదనలో తల్లి అరుపులు ఎవరికి అక్కర్లేదు.. పుట్టబోయే బిడ్డ ఏడుపు తప్ప”
ఇలా సినిమాలో ప్రతి డైలాగ్ అభిమానులతో క్లాప్స్ కొట్టేలా చేసింది. ఇంటర్వల్ బ్యాంగ్ వరకు సినిమా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలవుతుందో.. సినిమా కాస్త స్లో అయిందనే భావన కలుగుతుంది. ఆఖరి 40 నిమిషాల యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమాలో ఉన్న మూడు యుద్ద సన్నివేశాలను ఎంతో అధ్బుతంగా డిజైన్ చేశారు. నేపద్య సంగీతం ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ పాటలు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయి. సాహిత్య విలువలు బావున్నాయి. జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫీ సినిమాకు అసెట్. ఈ సినిమాను బాలయ్య లేకుండా ఊహించుకోలేము అనడంలో అతిశయోక్తి లేదు. తన నటనతో, గాంభీరంతో ఆకట్టుకున్నాడు. కొన్ని చోట్ల ఇబ్బంది పడినట్లుగా అనిపించినా.. తను డైలాగ్స్ పలికే తీరుతో మర్చిపోయేలా చేశాడు. శ్రియ ఈ సినిమాలో గ్లామర్ వరకు పరిమితమైంది. ఆమె చెప్పే రెండు, మూడు డైలాగ్స్ఆకట్టుకుంటాయి. హేమామాలిని, శాతకర్ణి తల్లి పాత్రలో ఎంతో హుందాగా కనిపించారు. భారతదేశాన్ని ఎంతో గొప్పగా పాలించిన ఈ రాజు కథ ప్రస్తుతం ఉన్న జెనరేషన్ కు చాలా వరకు తెలియదు. దాన్ని తెలియజెప్పడానికి క్రిష్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది.
రేటింగ్: 3.5/5