
Government Notice to OTT Platforms:
ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అభ్యంతరకరమైన కంటెంట్ పెరుగుతోంది. సోషల్ మీడియాలోనూ వివాదాస్పద వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓటీటీ, సోషల్ మీడియా సంస్థలకు స్పెషల్ అడ్వైజరీ జారీ చేసింది.
కొన్ని రోజుల క్రితం, యూట్యూబ్‌లో ప్రసారమైన ఓ ఇంటర్వ్యూలో యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తల్లిదండ్రుల గురించి అనుచితంగా మాట్లాడడంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యవహారంపై కోర్టుల నుంచి కూడా ఆగ్రహ స్పందన వచ్చింది.
దీంతో, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దేశంలోని ఓటీటీ సంస్థలకు స్పష్టమైన హెచ్చరికలు పంపింది. ఐటీ చట్టం -2021లోని కోడ్ అఫ్ ఎథిక్స్‌ను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. చిన్నారులకు అనుచితమైన కంటెంట్‌ను చూపించకూడదని, వయస్సు ఆధారిత ఫిల్టర్‌లు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది.
కేంద్రం తెలిపిన ముఖ్యమైన సూచనలు:
*రేట్‌డ్ కంటెంట్‌ను పిల్లలకు అందించకూడదు.
*అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌ను నియంత్రించాలి.
*ఐటీ చట్టం, BNS 2023, POCSO చట్టాలను పాటించాలి.
*స్వీయ నియంత్రణ సంస్థలు ముందస్తుగా చర్యలు తీసుకోవాలి.
అల్లాబాడియా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కేసులు నమోదవ్వడంతో, అతను సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే, కోర్టు మాత్రం కేంద్రాన్ని ప్రశ్నించింది – “ఇలాంటివి మళ్లీ జరగకుండా ఏమైనా చర్యలు తీసుకుంటారా?” అంటూ నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం ప్రధాన మీడియాపై చాలా నియంత్రణలు ఉన్నా, సోషల్ మీడియా మాత్రం నియంత్రణ లేకుండా పోయింది. దీనివల్ల అనేక మంది ఇష్టం వచ్చినట్టుగా కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారు. కేంద్రం తాజా హెచ్చరికతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మరింత కఠిన నిబంధనలతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.