
Saif Ali Khan Properties:
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఇప్పటికే వ్యక్తిగత దాడి ఘటనతో వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు ఆయన కుటుంబానికి చెందిన భోపాల్‌లోని రూ. 15,000 కోట్ల “ఫ్లాగ్ హౌస్” ఆస్తిపై మరో వివాదం మొదలైంది. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం, ఈ చారిత్రక ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
భోపాల్ నవాబు నవాబ్ హమీదుల్లా ఖాన్కి చెందిన ఈ ఆస్తి, కుటుంబ వారసత్వం ప్రకారం, సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీకి చెందుతుంది. అయితే 1968లో రూపొందించిన ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం, పాకిస్తాన్‌కు వెళ్లిన వారసుల ఆస్తులు భారత ప్రభుత్వానికి చెందుతాయి.
నవాబ్ హమీదుల్లా ఖాన్ పెద్ద కూతురు అబిదా పాకిస్తాన్‌కు వెళ్లిందని కేంద్రం ప్రకటించడంతో, ఈ ఆస్తి ఇప్పుడు ప్రభుత్వ అధీనంలోకి రావచ్చు. అయితే సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్, సోహా అలీ ఖాన్, సబా అలీ ఖాన్ వంటి వారసులు ఈ ఆస్తిపై తమ హక్కు ఉందని కోర్టులో దావా వేశారు.
మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల పటౌడీ కుటుంబానికి తమ వాదనలు వినిపించేందుకు 30 రోజుల గడువిచ్చింది. కానీ ఆ గడువు ముగిసిపోవడంతో ఇప్పుడు డివిజన్ బెంచ్లో సవాలు చేయడమే కుటుంబానికి మిగిలిన ఏకైక మార్గంగా కనిపిస్తోంది.
భోపాల్‌లోని ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, పటౌడీ నవాబు కుటుంబ చరిత్రకు ప్రత్యేక గుర్తింపుగా ఉంది. 2011లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణం తర్వాత, నవాబు బిరుదు సైఫ్ అలీఖాన్‌కు వరించింది. కానీ ఇప్పుడు ఈ ఆస్తి ప్రభుత్వ ఆధీనంలోకి రావడం కుటుంబానికి పెద్ద ఇబ్బందిగా మారింది.
పటౌడీ కుటుంబానికి ఇప్పుడు డివిజన్ బెంచ్లో కోర్టు ఉత్తర్వులను సవాలు చేయడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు అంటున్నారు. చూడాలి మరి, ఈ చారిత్రక ఆస్తి ఎవరి దగ్గరుంటుంది అని!
ALSO READ: పెళ్ళి విషయంలో నాగ చైతన్య ను ఫాలో అవుతున్న Akkineni Akhil?