కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. అందువల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడానికి టాలీవుడ్ హీరో గోపీచంద్ ముందుకొచ్చారు. 1000కిపైగా పేద కుటుంబాలకు నెలకు సరిపడా సరకులు, నిత్యావసరాల్ని పంపిణీ చేశారు. ఆయనే స్వయంగా వీటిని పేదలకు అందించారు. ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళీ కూడా తనవంతు సాయం చేస్తానని చెప్పారు. 50 పేద కుటుంబాలకు నెలకు సరిపడే విధంగా సరకులు అందిస్తానని పేర్కొన్నారు.
ఆదిత్యా మ్యూజిక్ నిర్వాహకులు రూ.31 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు చెక్కును అందించారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత రామ్ తల్లూరి రూ.5 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చారు. ‘సీఎం కేసీఆర్ న్యాయకత్వంలో కరోనా మహమ్మారి నుంచి మనల్ని కాపాడేందుకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్న వారి కోసం.. కేసీఆర్, కేటీఆర్, పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నా వంతుగా రూ.5 లక్షలు విరాళం ఇస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి శ్రీసత్యసాయి ఆర్ట్స్ నిర్మాత కె.కె. రాధామోహన్ రూ.5 లక్షలు విరాళంగా అందించారు. అందరూ లాక్‌డౌన్‌ను పాటించాలని కోరారు. అప్పుడే కరోనా వైరస్‌తో పోరాటం సాధ్యమౌతుందని చెప్పారు.