రైతు భరోసా పథకం కింది ఏపీలోని రైతులకిచ్చే పంట పెట్టుబడి సాయం ఏడాదికి రూ. 12,500 నుంచి 13,500కి పెంచుతున్నట్లుగా సీఎం జగన్ ప్రకటించారు. అదే విధంగా ఈ పథకాన్ని ఐదేళ్లపాటు కొనసాగిస్తామని తెలిపారు. ఐదేళ్లలో రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 67,500 సాయం అందనుంది. రేపు నెల్లూరు జిల్లాలోని కాకటూరులో రైతు భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రతి ఏడాది మూడు విడతల్లో రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు. మే నెల ఖరీఫ్‌లో రూ. 7,500, రబీ అవసరాల కోసం రూ. 4,000, సంక్రాంతి సమయంలో రూ. 2,000ను పెట్టుబడి సాయం రైతు భరోసా పథకం కింద పంపిణీ చేస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి రూ. 5,510 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పథకానికి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ సమ్మాన్ యోజనగా నామకరణం చేశారు.