Sitara Ghattamaneni: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని.. సోషల్ మీడియాల నుంచి ఓటీపీ పేరుతోనో, గిఫ్ట్ పేరుతోనో మొబైల్స్‌కు లింకులు పంపించటం.. దాన్ని క్లిక్ చేయటంతోనే ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. అలాగే అమ్మాయిల పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పంపి.. దాన్ని క్లిక్ చేయగానే నగదు కాజేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఎన్నోసార్లు ప్రజలకు సూచించారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.
అయితే.. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పేరునే వాడేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. సితార పేరుతో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తూ.. కొత్త మోసానికి తెర తీశారు. ఇన్‌స్టాగ్రాంలో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపి నగదు కాజేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుండటంతో.. మహేష్ బాబు టీం రంగంలోకి దిగింది.
ఈ మోసాలపై మహేష్ బాబు బృందం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎలాంటి అనుమానాస్పద నోటిఫికెషన్స్‌కు, రిక్వెస్టులకు స్పందించొద్దని అభిమానులకు మహేష్ బాబు బృందం సూచించింది. అయితే.. ఈ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఇలాంటి రిక్వెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సితారకు ఇన్ స్టాలో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ విషయాలు, రీల్స్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.