మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘జిన్నా’. సూర్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని సొంత బ్యానర్లో విష్ణు నిర్మించారు. పాయల్ – సన్నీ లియోన్ హీరోయిన్‌గా నటించారు. జి.నాగేశ్వరరెడ్డి మూలకథను అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఈ రోజు థియేటర్‌ల్లో విడుదలైంది.
కథ: 2007లో చిత్తూరు జిల్లా ‘రంగంపేట’ విలేజ్ లో ఈ కథ మొదలవుతుంది. అక్కడి స్కూల్లో గాలి నాగేశ్వరరావు (మంచు విష్ణు) చదువుకుంటూ ఉంటాడు. అతనికి తనని ‘జిన్నా’ అని పిలవడమే ఇష్టం. అలాంటి పరిస్థితుల్లోనే తన కూతురు రేణుకను తీసుకుని అమెరికా నుంచి ‘రంగంపేట’ గ్రామంలోని తన తమ్ముడు వీరస్వామి( నరేశ్) దగ్గరికి నారాయణస్వామి (సురేశ్) వస్తాడు. ఆ సమయంలోనే జిన్నా – రేణుక మధ్య స్నేహం ఏర్పడుతుంది. రేణుక మాట్లాడలేదు .. వినికిడిశక్తి లోపం కూడా ఉంటుంది. సొంత ఊరులో ఉండమని వచ్చిన నారాయణ స్వామి, తమ్ముడు వీరస్వామి స్వార్థం భరించలేక ఆస్తిపాస్తులను అతనికే ఇచ్చేసి తిరిగి అమెరికా వెళ్లిపోతాడు.
కాలచక్రం గిర్రున తిరుగుతుంది .. వీరస్వామి తన ఆస్తిపాస్తులను పోగొట్టుకుని వీధిన పడతాడు. ఇక జిన్నా విషయానికి వస్తే అతను అప్పు చేసి ఒక టెంట్ షాపు పెట్టుకుని నడుపుతుంటాడు. అయితే అతను టెంట్ వేస్తే ఆ పెళ్లి ఆగిపోతుందనే ఒక ప్రచారం జరుగుతుంది. దాంతో అతని వ్యాపారం దెబ్బతినడంతో, అప్పు తీర్చలేకపోతాడు. అప్పుతీర్చమని గోవర్ధన్ ఒత్తిడి చేస్తుంటాడు. అతనిని ప్రేమిస్తున్న స్వాతి (పాయల్) కూడా ఈ విషయంలో ఎలాంటి సహాయం చేయలేకపోతుంది.
సరిగ్గా ఆ సమయంలోనే ఆ ఊరికి రేణుక (సన్నీ లియోన్) వస్తుంది. తన బాబాయ్ వీరాస్వామి ఇంటిని తనఖా నుంచి విడిపించి అతని కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఇక జిన్నాను పెళ్లి చేసుకోవాలనేదే ఆమె ఆశ .. ఆశయం. తనకి మనసిచ్చిన జిన్నాను రేణుక ఎక్కడ తన్నుకుపోతుందో అనేది స్వాతి టెన్షన్. రేణుక దగ్గర కోట్ల రూపాయలను ఉన్నాయని తెలిసిన జిన్నా, అప్పుల బారి నుంచి బయటపడటానికీ .. ప్రెసిడెంటు ఎన్నికలలో గెలవడానికి ఆమెను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తుంటాడు. అయితే జిన్నాను పెళ్లి చేసుకుని రేణుక వెళ్లిపోతే .. కోట్ల రూపాయలు చేజారిపోతాయని భావించిన వీరస్వామి అన్న కూతురిని హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ.
నటీనటులు : ‘జిన్నా’ పాత్రలో విష్ణు చాలా బాగా చేశాడు. డాన్సులు .. ఫైట్లు కూడా ఇరగదీశాడు. సన్నీ లియోన్ బాగా చేయడానికి ట్రై చేసింది. ఇక పాయల్ ఉన్నంతలో అందంగానే మెరిసింది. నరేశ్, చమ్మక్ చంద్ర, వెన్నెల కిశోర్ తమ పరిది మేరకు నటించారు..
విశ్లేషణ: మంచు విష్ణుకి యాక్షన్ కామెడీ సినిమాల ద్వారా హిట్స్ ఇచ్చిన జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి కథను అందించాడు. పైగా ఈ కథ వెనుక కోన వెంకట్ ఉన్నాడు, అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. ఇన్‌టర్వెల్ వరకూ ఈ కథ యాక్షన్ కామెడీ జోనర్ లో .. గతంలో వచ్చిన మోహన్ బాబు సినిమాలను గుర్తుచేస్తూ నడుస్తుంది. అయితే సెకండాఫ్ నుంచి ఈ సినిమా ‘చంద్రముఖి’ తరహాలో రూట్ మార్చుకుంటుంది. కథనం స్లోగా అనిపించినప్పటికీ ఫస్టాఫ్ బెటర్ అనిపిస్తుంది. ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది అనూప్ రూబెన్స్ సంగీతం అనే చెప్పాలి.
టైటిల్ : ‘జిన్నా’
నటీనటులు : విష్ణు మంచు,పాయల్ రాజ్‌పుత్,సన్నీ లియోనీ, నరేష్, సురేష్, అన్నపూర్ణ, వెన్నెల కిషోర్,రఘుబాబు,సునీల్ తదితరులు
నిర్మాణ సంస్థలు: అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నిర్మాతలు: మోహన్ బాబు, మంచు విష్ణు
దర్శకత్వం: సూర్య
సంగీతం : అనూప్ రూబెన్స్
హైలైట్స్: మంచు విష్ణు నటన
డ్రాబ్యాక్స్: స్లోగా అనేపించే ఫస్టాఫ్
చివరిగా: కాలక్షేపానికి ‘జిన్నా’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)