తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో రిగ్ నుంచి గ్యాస్ లీకేజీ అవుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి గ్యాస్ లీక్ అవుతున్నా ఇప్పటివరకు అధికారులు మాత్రం లీకేజీని ఆపలేకపోయారు. ఓఎన్‌జీసీ అధికారుల ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతున్నారు. లీకేజీ ప్రారంభమైన కొద్దిసేపటికే పెద్ద శబ్ధంతో ఉవ్వెత్తున ఎగిసి పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అక్కడ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించారు. ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎవరూ అగ్నిప్రమాదం సంభవించే చర్యలు చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇంట్లో ఎవరూ పొయ్యి కూడా వెలిగించొద్దని ఆదేశాలిచ్చారు. ముంబై నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించారు.
రిగ్ సమీపంలోని రహదారుల్లో కూడా రాకపోకలను నిలిపివేశారు. గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకొని చమురు, సహజ వాయువుల వెలికితీతలో భాగంగా పదేళ్ల క్రితం ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ చేసి తవ్విన బావిలో ప్రెజర్ గ్యాస్ రావడంతో సీల్ చేసి వదిలేశారు. తాజాగా ఆ రిగ్‌ను మరో ప్రైవేటు సంస్థకు అప్పగించిన నేపథ్యంలో వారు కార్యకలాపాల నిర్వహణకు సమాయత్తమవుతున్న తరుణంలో వాల్వ్ వదిలేయడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. భయంతో స్థానికులు కొందరు అక్కడ ఇళ్లకు తాళాలు వేసి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే దొంగలు ఇదే అదనుగా భావించి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు.