May 9 Special Movies: మే 9కి టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకమైన రోజు అనే చెప్పాలి. ఈ రోజు సినీ పరిశ్రమకు చాలా సెంటిమెంట్. అందుకే కేలండర్‌లో సంవత్సరాలు మారినా తెలుగు ఇండస్ట్రీకి లక్కీ డే. ఇండస్ట్రీ రికార్డుల బద్దలుకొట్టిన రోజు. టాలీవుడ్ హీరో, హీరోయిన్లకు స్టార్ స్టేటస్ తీసుకురావడంతో పాటు దర్శకులు, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన రోజు. మే 9న రిలీజైన పలు సినిమాలు బాక్సాఫీసు వద్ద రికార్డులను తిరగరాశాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన నాటి జగదేకవీరుడు అతిలోక సుందరి నుంచి నిన్నటి మహర్షి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇదే డేట్‌లో రిలీజై రికార్డులు బద్దలు కొట్టాయి.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా 1990 మే 9న రిలీజైంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిత్ర నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలిచిందనే చెప్పొచ్చు. ఇందులోని పాటలు ప్రేక్షకులను ఇప్పటికీ ఉర్రూతలూగిస్తుంటాయి. ఇళయరాజా సంగీతం ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు.
అలాగే చిరంజీవి, విజయశాంతి హీరో హీరోయిన్లుగా వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీ కూడా 1991 మే 9న రిలీజై బాక్సాఫీసును షేక్ చేసింది. 30కి పైగా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రానికి విజయబాపినీడు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చిరంజీవి డ్యాన్స్, స్టైల్ యూత్‌ను తెగ ఆకట్టుకున్నాయి. డైలాగ్స్ అయితే మారుమోగిపోయాయి. చేయి చూశావా ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్ ఆడిస్తా అనే మాస్ డైలాగ్ జనాలకు బాగా నచ్చేసింది.
ఇంకా వెంకటేష్, అంజలాజవేరి నటించిన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం కూడా మే 9న 1997లో రిలీజైంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ ఓ రేంజ్ హిట్ అందుకుంది. ఇందులో వెంకటేష్, అంజలాజవేరి నటన హైలైట్. వీళ్లిద్దరి ప్రేమ కథ ఓ ట్రెండ్‌ను సెట్‌చేసింది. ఈ సినిమాలో వెంకటేష్ పక్కన ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా అనుకున్నారట. ఫైనల్‌గా అంజలాజవేరికి ఆ ఛాన్స్ దక్కింది. ఈ చిత్రంలో సాంగ్స్ కూడా హైలైట్.
నాగార్జున హీరోగా నటించిన సంతోషం మూవీ కూడా 2002 మేలోనే విడుదలైంది. సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇందులోని పాటలు కూడా హైలైట్. నాగార్జునతో పాటు శ్రియ, గ్రేసీసింగ్, ప్రభుదేవా నటించారు. నాగార్జున కెరీర్‌లోనే ఇది బెస్ట్ క్లాసిక్ లవ్‌స్టోరీగా నిలిచింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కొన్ని పాటలు రాశారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో నాగార్జున ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.
మహానటి సావిత్రి బయోపిక్ కూడా మే 9న 2018లో రిలీజైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్లాసిక్ హిట్‌గా నిలిచింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించింది. ఆమె నటనకు నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. కీర్తి సురేష్‌తో పాటు ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయదేవరకొండ, రాజేంద్రప్రసాద్, షాలినిపాండే ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందించారు.
మహేష్‌బాబు హీరోగా వచ్చిన మహర్షి చిత్రం కూడా మే 9న 2019లో రిలీజైంది. ఈ చిత్రం కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా కలిసి నిర్మించారు. ఈ చిత్రం 3 నేషనల్ అవార్డులు దక్కించుకుంది.
ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘భారతీయుడు’. ఈసినిమాలో కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ సినిమా 1996 లో మే 9న విడుదలై అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
సీనియర్ ఎన్టీఆర్ నటించిన పరువు ప్రతిష్ట 1963 మే 9న విడుదలైంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన భోగిమంటలు సినిమాలు 1981 మే 9న విడుదలైంది. మరియు కృష్ణ అదృష్టవంతుడు 1980 మే 9న రిలీజ్ అయింది.