మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడి సందేశాలను సినిమాలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సూచించారు. శనివారం రాత్రి ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఛేంజ్‌వితిన్ (ChangeWithin) పేరుతో కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి బాలీవుడ్ ప్రముఖులు అమిర్ ఖాన్, షారుక్ ఖాన్, బోనీ కపూర్, సోనమ్ కపూర్, కంగనా రనౌత్‌తోపాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. గాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారని కొనియాడారు. గాంధీకి నివాళిగా మొదలైన #ChangeWithin ఓ అద్భుతమైన ముందడుగని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బాలీవుడ్ నటులతో గాంధీపై రూపొందించిన వీడియోను మోడీ ట్విటర్‌లో షేర్ చేశారు. అందులో అమిర్ ఖాన్, ఆలియా భట్, సల్మాన్ ఖాన్, కంగన, రణ్‌బీర్ కపూర్, సోనమ్ కపూర్, షారుక్ ఖాన్ తదితరులు మహాత్మాగాంధీ సూక్తులను చెబుతూ కనిపించారు. ‘నువ్వు నాకు సంకెళ్లు వేయగలవు, నన్ను హింసించగలవు, ఈ శరీరాన్ని నాశనం చేయగలవు.. కానీ నా ఆలోచనలకు బంధించలేవు..’ అనే గాంధీ మాటలతో వీడియో ఆరంభమైంది. ‘బలహీనులు ఇతరుల్ని క్షమించలేరు.. బలమైన వ్యక్తిత్వం ఉన్న వారికి మాత్రమే క్షమించే గుణం ఉంటుంది..’ అని ఆలియా చెప్పారు. ఇలా వీరంతా ప్రజలకు సందేశాలు బోధిస్తూ కనిపించారు.